andhra pradesh polavaram project ysrcp tdp undavalli arun kumar పోలవరం ప్రాజెక్టు వైసీపీ టీడీపీ పిటిషన్లు హైకోర్టు politics
పంచాయతీ అజెండాలో పోలవరం- కేంద్రానికి వైసీపీ వినతులు, హైకోర్టు పిటిషన్లు, కాంగ్రెస్ హామీలు
ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోరులో స్ధానిక అంశాల కంటే పోలవరం పోరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక జాతీయ ప్రాజెక్టు పూర్తి కోసం వైసీపీ సర్కారు ఇప్పటికే తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే తాజాగా కేంద్రం పెడుతున్న కొర్రీలతో ప్రాజెక్టు సకాలంలో పూర్తవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అదనుగా ప్రాజెక్టు కోసం కేంద్రం పూర్తి సాయం చేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతుండగా.. కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ప్రాజెక్టు పూర్తి చేస్తామంటోంది. వీటి మధ్యే వైసీపీ సర్కారు పోలవరానికి నిధులు విడుదల కోసం కేంద్రం చుట్టూ చక్కర్లు కొడుతోంది.

పంచాయతీ అజెండాగా పోలవరం
ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న పలు సమస్యలతో పోలిస్తే పోలవరం పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రధానంగా నాలుగు జిల్లాలకు నేరుగా, మరికొన్ని జిల్లాలకు పరోక్షంగా ఉపయోగపడుతుందని భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్రం పెడుతున్న తాజా కొర్రీలతో ఈ వ్యవహారం ఎన్నికల అంశంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. పోలవరంపై కేంద్రం పెడుతున్న కొర్రీలతో ఇది సకాలంలో పూర్తి కాదని అంచనా వేస్తున్న విపక్ష పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. హైకోర్టులో పిటిషన్లతో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.

పోలవరం నిధులపై హైకోర్టులో పిటిషన్లు
జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రం పూర్తి స్ధాయిలో నిధులు ఇవ్వాల్సి ఉంది. కానీ కేంద్రం వివిధ సాకులతో ప్రాజెక్టు డీపీఆర్ ఆమోదం ప్రకారం నిధుల విడుదలకే కొర్రీలు పెడుతోంది. దీంతో కేంద్రం ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు వీలుగా మొత్తం నిధులు ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై హైకోర్టు మరోమారు విచారణ జరపాల్సి ఉంది. ఆ తర్వాత కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం వాదన ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది. అయితే పోలవరంపై హైకోర్టులో పిటిషన్లతో బీజేపీ, వైసీపీ మాత్రం ఇరుకునపడుతున్నాయి.

పోలవరం పూర్తికి మరోసారి కాంగ్రెస్ హామీ
పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలపై నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి రంగంలోకి దిగింది. ఏపీలో ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడంతో తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పిలిపించుకుని మరీ పోలవరంపై మరోసారి హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీతోనే పోలవరం పూర్తవుతుందని, అందుకు ప్రజలు మద్దతివ్వాలని జగ్గారెడ్డి తాజాగా కోరారు. ఇప్పటికే కాంగ్రెస్ మాజీ ఎంపీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసి పోరాడుతున్న నేపథ్యంలో జగ్గారెడ్డి ఏపీకి వచ్చి పోలవరంపై ఇచ్చిన హామీ ఆసక్తి రేపుతోంది. పోలవరం అజెండాతో రాబోయే ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ఎదర్కోనుందా అనే వాదన వినిపిస్తోంది.

పోలవరం కోసం కేంద్రం చుట్టూ వైసీపీ చక్కర్లు
పోలవరం ప్రాజెక్టు పాత డీపీఆర్ ప్రకారం ఆమోదం తెలిపినట్లు చెబుతున్నా, అందులో కేంద్రం పెడుతున్న కొర్రీలతో ప్రధానంగా వైసీపీ సర్కారు ఇరుకునపడుతోంది. ప్రాజెక్టును అనుకున్న సమయానికే పూర్తి పూర్తి చేస్తామని పైకి చెబుతున్నా నిధుల కొరతతో ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో తాజాగా ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మరోమారు కేంద్ర మంత్రులను కలిసి పోలవరం నిధుల విడుదలకు విజ్ఞప్తి చేశారు. పాత డీపీఆర్ ప్రకారమే నిదులు విడుదల చేయాలని కోరారు. అయితే ఇప్పటికే సీఎం జగన్ కూడా హోంమంత్రి అమిత్‌షాతో భేటీలోనూ పోలవరానికి సహకరించాలని కోరిన నేపథ్యంలో బుగ్గన టూర్తోనైనా నిధులు విడుదలవుతాయో లేదో చూడాల్సి ఉంది.