పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై నీలినీడలు .. కేంద్రాన్ని ఒప్పించేందుకు జగన్ సర్కార్ వ్యూహం ఏంటి ?
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాలతో వివాదాస్పదంగా మారింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2013 -2014 నాటి అంచనా వ్యయాన్ని మాత్రమే ఇస్తామని కేంద్రం ప్రకటించటంతో పాటుగా, ప్రాజెక్టు నిర్మాణానికి మాత్రమే నిధులు ఇస్తామని పునరావాసం సంబంధం లేదని తాజాగా ఇచ్చిన సమాచారంతో తేల్చి చెప్పింది. దీంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి పెనుభారంగా మారింది.
బాబు ప్రభుత్వ తప్పిదాల వల్లే పోలవరం ప్రాజెక్ట్ నిధులకు కేంద్రం కొర్రీలు: మంత్రి అనిల్ కుమార్ యాదవ్

2021 జూన్ నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చెయ్యాలన్న నిశ్చయంతో సీఎం జగన్
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏపీ సర్కార్ కృత నిశ్చయం తో ఉంది. 2021 జూన్ నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చెయ్యాలని సీఎం జగన్ అధికారులను గతంలోనే ఆదేశించిన విషయం తెలిసిందే . ఈ క్రమంలో కేంద్రం నుండి పోలవరంపై కీలక అంశాలు బయటకు వస్తున్న క్రమంలో ఎలాగైనా కేంద్రంతో చర్చలు జరిపి యూపీఏ హయాంలో విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు పోలవరం నిర్మాణం తో పాటుగా, పునరావాస కల్పన కూడా కేంద్రమే బాధ్యత వహించాలని కేంద్రాన్ని గట్టిగా కోరాలని నిర్ణయించుకుంది ఏపీ సర్కార్.

పోలవరం నిర్మాణంపై కేంద్రాన్ని ఒప్పిస్తామనే ధీమాలో వైసీపీ మంత్రులు
గత ప్రభుత్వం కమిషన్ ల కోసం చేసిన పనుల కారణంగానే ప్రస్తుతం పోలవరం కు ఇలాంటి పరిస్థితి వచ్చిందని వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. పోలవరం నిర్మాణం అసలు కేంద్రమే చేస్తుందని, కానీ కమీషన్ల కోసమే చంద్రబాబు నిర్మాణ బాధ్యతలు రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా కోరి పోలవరం నిర్మాణం చేపట్టారని వైసిపి నేతలు మండిపడ్డారు. ప్రస్తుతం పోలవరం నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ పోలవరం నిర్మాణంపై కేంద్రాన్ని ఒప్పిస్తాం మెప్పిస్తాం అంటూ ధీమా వ్యక్తం చేశారు.

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రాజీ పడేది లేదన్న బొత్సా సత్యన్నారాయణ
పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ అవసరమైతే ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రానికి అప్పగిస్తామని , ఒకవేళ కేంద్రం కాదంటే రాష్ట్రం భరిస్తుందని ప్రకటించారు .అందుబాటులో ఉన్న అన్ని వనరులను పరిశీలించి నిర్ణీత సమయంలోనే పూర్తి చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. సాధ్యమైనంత వరకు కేంద్రాన్ని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.

కేంద్రానికి వ్యతిరేకంగా ఏపీ సర్కార్ పోరాటం కష్టమే !!
ఒకవేళ కేంద్రం నిధుల విషయంలో ఏపీ సర్కార్ విజ్ఞప్తికి ఒప్పుకోకుంటే కేంద్రం పైన వైసీపీ సర్కార్ పోరాటం చేస్తుందా అనేది ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటివరకు రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు కేంద్రానికి విజ్ఞప్తులు పంపించటం మినహా, కేంద్రం తీరుపై నిరసన వ్యక్తం చేసిన సందర్భాలు కానీ, కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు కానీ లేవు. ఇప్పటివరకు పలుమార్లు లేఖలు రాయడం, స్వయంగా వెళ్లి కలిసి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలకోసం విజ్ఞప్తులు చేయడం మినహాయించి పోరాటం బాట పట్టిన దాఖలాలు లేవు.

పోలవరం నిర్మాణం పూర్తి చెయ్యటానికి ఏపీ సర్కార్ వ్యూహంపై సర్వత్రా ఆసక్తి
తాజాగా కేంద్రం పోలవరం ప్రాజెక్టు విషయంలో తన వైఖరిని స్పష్టం చేయడంతో, మరి ఈ ప్రాజెక్టు నిర్మాణం పైన జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో పోరాటం చేస్తారా అంటే చెయ్యకపోవచ్చు అనే భావన వ్యక్తమవుతోంది. సాధ్యమైనంతవరకు కేంద్రాన్ని ఒప్పించడానికి ప్రయత్నం చేయాలనే ఆలోచన వైసీపీ సర్కార్ ఉంది. పోలవరం నిర్మాణం విషయంలో రకరకాల వాదనలు వెలుగులోకి వస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని మెప్పిస్తుందా? పోలవరం నిర్మాణానికి కావలసిన నిధులను ఇవ్వడానికి ఒప్పిస్తుందా అనేది అందరూ ఆలోచిస్తున్న అంశం .
ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు వైసీపీ సర్కార్ ఏం చెయ్యబోతుంది అన్నదే ఇప్పుడు అన్బ్ద్రి ముందున్న ప్రశ్న .