పోలవరంలో మరో ముందడుగు- కీలకమైన గ్యాప్ 1 డయాఫ్రం వాల్ పనులు ప్రారంభం..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2022 నాటికి ఎట్టిపరిస్ధితుల్లోనూ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ సర్కారు పనుల వేగాన్ని
పెంచింది. ఇప్పటికే గర్డర్ల బిగింపు పూర్తవుతుండగా.. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో కీలకమైన గ్యాప్ 1 డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఇవాళ ప్రారంభించారు.

ప్రధాన డ్యామ్‌లో కీలకమైన డయా ఫ్రం వాల్ నిర్మాణ పనులు ఇప్పటికే కొనసాగుతుండగా.. అందులో గ్యాప్ 1 నిర్మాణ పనులను ఇవాళ నిర్మాణసంస్ధ మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులు ప్రారంభించారు. మొత్తం 450 మీటర్ల పొడవైన ఈ డయాఫ్రమ్ వాల్ ప్రధాన డ్యామ్‌కు కీలకమైనదని చెబుతున్నారు. ఇది కూడా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామే. ప్లాస్టిక్ కాంక్రీట్‌తో నిర్మించే ఈ డయాఫ్రమ్ వాల్లో మొత్తం 89 ప్యానెల్స్ ఉంటాయి. సాధ్యమైనంత త్వరగా వీటి నిర్మాణం పూర్తి చేసేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్ధ రాత్రింబవళ్లూ శ్రమిస్తోంది.

ఏపీలో అల్పపీడనం కారణంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. దీంతో పోలవరం ప్రాజెక్టు వద్ద పనులకు కూడా అంతరాయం కలుగుతోంది. అయినా వర్షం మధ్యలోనే ఇవాళ డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబు, ఎస్ఈ నాగిరెడ్డి, ఈఈ పాండురంగయ్య, డీఈలు ప్రసాద్, అనిల్, శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేఘా ఇంజనీరింగ్ సంస్ధ తరఫున జీఎం అంగర సతీష్ బాబు, ముద్దుకృష్ణ, ఏజీఎం క్రాంతి పాల్గొన్నారు.