నాగబాబుపై కేసు.. పవన్ మౌనం దేనికి సంకేతం.. జనసేనకు ప్లస్సా.. మైనస్పా..
2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు గాంధేయ వాదం తమకు ఆదర్శమని,సోషలిజం తమ పంథా అని చాటి చెప్పుకున్నారు. పార్టీ ఫ్లెక్సీలన్నింటిలోనూ గాంధీ బొమ్మను ముద్రించారు. రెండేళ్లు తిరగకుండానే కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో పార్టీ ప్రస్థానం ముగిసిపోయింది. ఆ తర్వాత మెగా కాంపౌండ్ నుంచే పవన్ కల్యాణ్ రూపంలో జనసేన పార్టీ ఆవిర్భవించింది. కమ్యూనిస్టు భావజాలం అంటే తనకు ఇష్టమని,చేగువేరా తనకు ఆదర్శమని అనేక వేదికలపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. భారత రాజకీయాల్లో బహుజన రాజకీయాలను నిర్మించిన కాన్షీరాం అంటే తనకు అమితమైన అభిమానమని,ఆదర్శమని చెప్పుకున్నారు. అలాంటి పవన్ కల్యాణ్ బీజేపీతో జతకట్టడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే సమకాలీన రాజకీయాల్లో సిద్దాంత నిబద్దతను వెతకడం వృథా ప్రయాస అనుకున్నవాళ్లకు ఇదేమీ ఆశ్చర్యమనిపించలేదు. అయితే కాషాయ పార్టీతో జతకట్టాక.. పవన్ తన పొలిటికల్ గురువుగా ప్రకటించుకున్న నాగబాబు ధోరణి పవన్‌ను మరింత ఇరకాటంలోకి నెట్టేదిగా మారిందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జనసేన ఆఫీస్ వద్ద ఉద్రిక్తత: పవన్ కళ్యాణ్‌తో పోలీసుల భేటీ, రాజధానికి వెళ్తామంటూ నాగబాబు

నాగబాబు లాజిక్ మరిచిపోయారా..?
హత్య ఎవరు చేసినా హంతకుడే అవుతారు.. దానికి మినహాయింపులు ఉండవు. కానీ జనసేన నేత,మెగా బ్రదర్ నాగబాబు మాత్రం గాంధీని గాడ్సే చంపడం కరెక్టా.. కాదా.. అన్నది చర్చల్లో తేలాల్సిన విషయంగా పేర్కొన్నారు. పైగా గాడ్సే వైపు వాదన వినిపించేందుకు అప్పట్లో ఏ మీడియా లేదని.. అపఖ్యాతి పాలవుతాడని తెలిసినా గాంధీని హత్య చేశాడని చెప్పారు. ఈ లెక్కన ఉగ్రవాది కసబ్,స్మగ్లర్ వీరప్పన్ కూడా.. వాళ్ల వాళ్ల దృక్కోణంలో తమదే సరైన పంథా అని భావిస్తారు కదా అని సోషల్ మీడియాలో అనేక కౌంటర్లు వినిపించాయి.

ఓయూలో కేసు నమోదు..
రాజకీయంగానూ నాగబాబు కామెంట్స్ దుమారం రేపేవిగా మారాయి. ఆఖరి సొంత పార్టీ జనసైనికులే నాగబాబు కామెంట్స్‌ను సమర్థించలేని పరిస్థితి. ఎంత బీజేపీకి దగ్గరవాలనుకుంటే మాత్రం ఇంతలా దిగజారాలా అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా నాగబాబుపై కేసు కూడా నమోదైంది. జాతిపిత మహాత్మా గాంధీని కించపరిచారంటూ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు, నాగబాబుకు మతిభ్రమించిందని, ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించాలన్నారు. మానసిక స్థితి సరిగా లేనందునే ట్విటర్‌లో గాంధీని హత్యచేసిన గాడ్సేను ప్రశంసించాడని అన్నారు.ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మానవతారాయ్ డిమాండ్ చేశారు.

పవన్ మౌనం దేనికి సంకేతం..
కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి కూడా నాగబాబుకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. 'కుల, మతాలు వేరైనా దైవం ఒక్కటే.. ఎన్ని తరాలైనా జాతిపిత ఒక్కడే... 130 కోట్ల మంది భారతీయులకు మహత్ముడు ఒక్కడే... ఈశ్వర్, అల్లా... తేరానామ్... సబ్ కో సన్మతి దే భగవాన్.. గాడ్సే ఇప్పుడు బతికుంటే.. ఈ జన్మదినం నాడు ఇదే ప్రార్థించేవాడు.. మన్నించండి మహాత్మా..' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇలా నాగబాబు వ్యాఖ్యలపై వివాదం ముదురుతున్నా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించకపోవడం గమనార్హం. నాగబాబు వ్యాఖ్యలను ఖండించడం గానీ సమర్థించడం గానీ.. రెండింటిలో ఏ రకంగా స్పందించినా.. పవన్ కల్యాణ్ భవిష్యత్ రాజకీయంపై మరింత క్లారిటీ వచ్చేదని అంటున్నారు. పవన్ తన రాజకీయ గురువుగా ప్రకటించుకున్న నాగబాబు వ్యాఖ్యలపై మౌనం వహించడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు.

పార్టీకి ప్లస్సా.. మైనస్సా..
ఇన్ఫాక్ట్ తనను విమర్శించేవాళ్ల కంటే తనకు గాంధీ అంటే చాలా గౌరవమని నాగబాబు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా.. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సోషల్ మీడియాలో నాగబాబు వ్యాఖ్యలపై విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా నెటిజెన్స్ పవన్ కల్యాణ్‌కు ప్రశ్నలు సంధిస్తున్నారు. జనసేన ప్రస్థానం చెగువేరా నుంచి మొదలుపెట్టి గాడ్సే వరకూ చేరిందా అని ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శలకు,ప్రశ్నలకు పవన్ కల్యాణ్ సమాధానం ఇవ్వక మౌనం దాల్చడం పార్టీకి ప్లస్ అవుతుందా.. మైనస్ అవుతుందా అని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. మొత్తం మీద నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పట్లో తెరమరుగయ్యేలా లేవు.