ఏపీలో టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలపై పోలీసుల ఉక్కుపాదం.. టీడీపీ , సీపీఐ నేతల గృహ నిర్బంధం
టిడ్కో ఇళ్ళ గృహప్రవేశ కార్యక్రమాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నిరుపేదలకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నిర్మించిన టిడ్కో గృహాలను అందించాలని ఏపీ ప్రభుత్వానికి డిమాండ్ చేసిన టిడిపి, సిపిఐ లు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టిడ్కో సముదాయాల్లో గృహప్రవేశాలకు నేడు సిపిఐ పిలుపునిచ్చింది. దీంతో గృహప్రవేశాలకు హాజరు కావద్దని సిపిఐ నేతలకు నోటీసులు జారీ చేసిన పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ నేతలు, మహిళా సంఘాల ప్రతినిధులను గృహనిర్బంధం చేశారు.
ఏపీ సర్కార్ భూముల వేలం .. వంద కోట్లకు పైగానే .. విశాఖ, గుంటూరులలో బిడ్ లకు ఆహ్వానం..

టిడ్కో గృహ సముదాయాల్లో గృహప్రవేశాలకు సిపిఐ పిలుపు.. పోలీసుల అరెస్ట్ లు
మరోపక్క టిడిపి నాయకులను సైతం గృహ నిర్బంధం చేసి పోలీసులు నేడు గృహప్రవేశ కార్యక్రమాన్ని భగ్నం చేశారు. టిడ్కో గృహ సముదాయాల్లో గృహప్రవేశాలకు సిపిఐ పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని పలు చోట్ల టిడిపి, సిపిఎం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా విజయవాడలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణను , తాడేపల్లి లో సిపిఎం నేత రామకృష్ణ గృహనిర్బంధం చేసిన పోలీసులు తుళ్లూరులో సిపిఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు అరెస్ట్ చేసి అమరావతి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ నాయకులను , టీడీపీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు
టీడీపీ మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు ను, గుంటూరు జిల్లా నరసరావుపేట లో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చదలవాడ అరవింద్ బాబు ను , మచిలీపట్నం టిడిపి ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు, రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ర్యాలీగా టిడ్కో గృహాల వద్ద కు వెళుతున్న వారిని అరెస్ట్ చేశారు.
విశాఖ జిల్లా వాంబే కాలనీ లో గృహప్రవేశ కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు 25 మంది సిపిఐ జిల్లా నేతలను అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో, అలాగే విజయనగరం జిల్లాలోనూ టిడ్కో గృహాల వద్దకు ర్యాలీగా వెళుతున్న వారిని అరెస్టు చేశారు.

కడపలో పోలీసులకు , సీపీఐ నాయకులకు వాగ్వాదం .. వర్షంలోనూ కొందరి గృహప్రవేశం
కడప జిల్లాలో టిడ్కో ఇళ్ళ గృహప్రవేశ కార్యక్రమంలో పోలీసులకు,సిపిఎం నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వర్షం కురుస్తున్నప్పటికీ గృహప్రవేశ కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రయత్నించిన సిపిఎం నాయకులను పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించగా , పోలీసుల కళ్లుగప్పి కొందరు లబ్ధిదారులు గృహప్రవేశం చేసి పాలు కూడా పొంగించేశారు. తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, నిరుపేదలైన లబ్ధిదారులతో గృహప్రవేశ కార్యక్రమాలు చేయిస్తున్నామని, ప్రభుత్వం అడ్డుకోవడం దారుణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సిపిఐ నాయకులు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేసిన వారు ప్రభుత్వ నిరుపేదలకు నిర్మించిన ఇళ్లను ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం సరైనది కాదని పేర్కొన్నారు. ఇప్పటికైనా లబ్ధిదారులను గృహప్రవేశాలు చెయ్యనివ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.