జగన్ కు తలనొప్పిగా నిఘా వైఫల్యాలు-అప్పుడు విజయవాడలో-ఇప్పుడు కోనసీమలో-దిద్దుకోకుంటే?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వాల తరహాలోనే ఆచిచూచి ఇంటెలిజెన్స్ అధికారుల్ని నియమిస్తోంది. ఒకప్పుడు తాము కోరుకున్న స్టీఫెన్ రవీంద్రను తెలంగాణ నుంచి రప్పించడంలో విఫలమైనా పీఎస్ఆర్ ఆంజనేయులు వంటి విధేయుడైన అధికారిని నియమించి మరీ ఇంటెలిజెన్స్ కు జవజీవాలు నింపాలని ప్రయత్నిస్తోంది. అయితే తాజాగా కోనసీమ, గతంలో ఛలో విజయవాడ వంటి ఘటనలు నిఘా వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

జగన్ సర్కార్ నిఘా వైఫల్యాలు
ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిఘా వైఫల్యాలు వెంటాడుతున్నాయి. అధికారులు మారుతున్నా, సిబ్బందికి బదిలీలు అవుతున్నా నిఘా వైఫల్యాలు మాత్రం ఆగడం లేదు. గతంలో స్ధానిక ఎన్నికల సమయంలో నిఘా వైఫల్యాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రభుత్వం, ఆ తర్వాత ఉద్యోగుల ఛలో విజయవాడ సమయంలో మరో భారీ వైఫల్యం ఎదుర్కోక తప్పలేదు. ఆ తర్వాత తాజాగా కోనసీమ హింసను గుర్తించడంలోనూ నిఘా పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గతంలో ఛలో విజయవాడ
ఉద్యోగులు పీఆర్సీ కోసం ఉద్యమిస్తున్న సమయంలో ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం దీన్ని లైట్ తీసుకుంది. ఎక్కడికక్కడ అరెస్టులు చేసి వారిని కట్టడి చేయొచ్చని భావించింది. నిఘా సమాచారంతో ఉద్యోగుల్ని విజయవాడ రాకుండా అడ్డుకోవచ్చని అనుకుంది.
కానీ ఇవేవీ పనిచేయలేదు. ఉద్యోగులు పెద్ద ఎత్తున విజయవాడకు వచ్చి బీఆర్టీఎస్ రోడ్డును నింపేశారు. ఉద్యోగుల ఆందోళనతో ఉలిక్కిపడ్డ ప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యలకు దిగింది. అప్పట్లో ఈ నిఘా వైఫల్యాన్ని జగన్ కూడా సీరియస్ గానే పరిగణించారు. అప్పటి డీజీపీ సవాంగ్ ఉద్వాసనకు కూడా ఇదే ప్రధాన కారణం అన్న ప్రచారం కూడా జరిగింది.

ఇప్పుడు కోనసీమలో
గతంలో విజయవాడలో భారీగా ఉద్యోగులు అనూహ్యంగా తరలివస్తే ఇప్పుడు కోనసీమలో రెండు రోజుల క్రితం యువత అదే స్ధాయిలో పోలీసులకు షాకిచ్చింది. కేవలం 400 మంది పోలీసుల్ని అమలాపురంలో బందోబస్తుగా పెడితే దాదాపు 5 వేల మంది తరలివచ్చి పోలీసుల్ని చెల్లాచెదురుచేశారు. ఎస్పీ స్ధాయిలో అధికారులపై దాడులు చేశారు. ఏకంగా మంత్రి నివాసాన్నే తగులబెట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యే నివాసం దగ్ధమవుతుంటే పోలీసులు చివరి నిమిషంలో రంగంలోకి దిగి వారి కుటుంబాన్ని రక్షించారు. దీంతో నిఘా వైఫల్యం మరోసారి స్పష్టంగా కనిపించింది.

తప్పులు దిద్దుకోకపోతే బాబు గతే?
గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోని ఇలాగే నిఘా వైఫల్యాలు వెంటాడాయి. ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ మరోసారి గెలుస్తుందని చంద్రబాబుకు ఇచ్చిన సమాచారం చరిత్రలో అతిపెద్ద వైఫల్యంగా నిలిచిపోయింది. అయితే ఏబీ వంటి వారిని నమ్ముకుని రాజకీయం చేసిన చంద్రబాబు చరిత్రలోనే అతి తక్కువ సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు నిఘా వైఫల్యాలతో సతమతం అవుతున్న జగన్ కూడా వాటిని సరిదిద్దుకోలేకపోతే మాత్రం వచ్చే ఎన్నికల్లో భారీ నష్టం తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మరి వీటిని ఇప్పటికైనా జగన్ సీరియస్ గా తీసుకుంటారా లేదా అన్నది చూడాలి.