ఏపీలో ఆగని ఉచిత మీటర్ల రచ్చ- వెనక్కి తగ్గని జగన్ సర్కార్-రైతులు దొంగలా అని టీడీపీ ఫైర్
ఏపీలో వ్యవసాయ ఉచిత విద్యుత్ మీటర్ల రచ్చ రోజురోజుకూ ముదురుతోంది. రైతులకు ఇచ్చే విద్యుత్ కూ మీటర్లు బిగించాలన్న వైసీపీ సర్కార్ నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం ముందుకే వెళ్లాలని నిర్ణయించింది. దీంతో రైతుల్లోకి ఈ విషయాన్ని బలంగా తీసుకెళ్లేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో రైతుల్లోనూ ఆందోళన పెరుగుతోంది.

ఉచిత మీటర్ల రచ్చ
ఏపీలో రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలన్న ప్రభుత్వ నిర్ణయం కాక రేపుతోంది. రాష్ట్రంలో దాదాపు 18 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించడం ద్వారా జవాబుదారీతనం తెస్తామని ప్రభుత్వం చెప్తుండగా.. రైతుల్ని దొంగల్లా చూస్తారా అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. దీంతో ప్రభుత్వం వీటిని సమర్ధించుకుినేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఆరునెలల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అన్నింటికీ మీటర్లు బిగించాలని వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

రైతుల్లో పెరుగుతున్న ఆందోళన
వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఏపీలో రైతులకు మేలు చేసే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్సార్ తీసుకొచ్చిన ఉచిత విద్యుత్ పథకం ఇప్పటివరకూ బేషరతుగా అమలవుతోంది. ఇందులో మార్పులు చేసేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించినా ముందుకెళ్లలేకపోయాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కార్ కేంద్రం ఇస్తానన్న 4 వేల కోట్లకు కక్కుర్తిపడి రైతుల మెడకు ఉరి బిగిస్తున్నాయని పొరుగు రాష్ట్రమైన తెలంగాణ మంత్రులు కూడా ఆరోపిస్తున్నారు. దీంతో వైసీపీ సర్కార్ ప్రయత్నాలపై రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

రైతులు దొంగలా అని టీడీపీ ప్రశ్న
ఉచిత విద్యుత్ వాడుకుంటున్న రైతులకు మీటర్ల వ్యవహారం ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో విపక్ష టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. ఉచిత విద్యుత్ ను తమ ఘనతగా చెప్పుకుంటూ ఇప్పుడు రైతులకు మీటర్ల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. రైతుల్ని దొంగల్లా చూస్తారా అంటూ టీడీపీ వ్యవసాయ కమిటీ ఛైర్మన్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని సోమిరెడ్డి తెలిపారు. గ్రామాల్లో జరుగుతున్న బాదుడే బాదుడు కార్యక్రమంలోనూ టీడీపీ రైతుల్లో అవగాహన కల్పిస్తోంది.

టీడీపీపై పెద్దిరెడ్డి ఫైర్
వ్యవసాయ మీటర్లపై వెనక్కి తగ్గేది లేదని చెప్తున్న వైసీపీ సర్కార్.. దీనిపై టీడీపీ రాజకీయాల్ని తప్పుబడుతోంది. రైతుల్ని టీడీపీ తప్పుదోవ పట్టిస్తోందని విద్యుత్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. 18 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లలో ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారో తెలుసుకునేందుకు మీటర్లు బిగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అక్రమ విద్యుత్ చౌర్యం అరికట్టేందుకు విజిలెన్స్ తో పాటు ఇతర విభాగాల్ని అప్రమత్తం చేస్తున్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు. దీంతో ఇప్పుడు వ్యవసాయ మీటర్ల వ్యవహారం రాజకీయ రచ్చకు కారణమవుతోంది.