జగన్ తో పోసాని భేటీ- భీమ్లా నాయక్ కు ఇబ్బందులా- పదవి ఒట్టిదే- సీఎంపై నిందలేస్తే !
ఏపీలో వైసీపీ సర్కార్ తో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న టాలీవుడ్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఇవాళ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. మరో టాలీవుడ్ నటుడు అలీ తరహాలోనే పోసానికి కూడా నామినేటెడ్ పదవి లభిస్తుందని ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో జగన్ తో ఆయన భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ తో భేటీలో పలు విషయాలు చర్చించిన పోసాని.. అనంతరం మీడియాతో మాట్లాడారు.

జగన్ తో పోసాని భేటీ
ఏపీలో వైసీపీతో ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వైఎస్ జగన్ కు గట్టి మద్దతుదారుగా ఉన్న టాలీవుడ్ నటుడు కమ్ రచయిత పోసాని కృష్ణమురళికి నామినేటెడ్ పదవి ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలీకి నామినేటెడ్ పదవిపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఇక మిగిలింది పోసాని మాత్రమేనన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం జగన్ ను పోసాని ఆయన నివాసంలో కలిశారు. దాదాపు గంటసేపు చర్చలు జరిపిన తర్వాత పోసాని మీడియాతో పలు విషయాలు చెప్పారు. తన కుటుంబానిక కరోనాతో భాదపడుతున్న సమయంలో సీఎం, ఆయన సతీమణి ఏఐజి ఆసుపత్రికి ఫోన్ చేసి మెరుగైన చికిత్స అందేలా సహకరించారని పోసాని తెలిపారు. అందుకే సిఎంను కలిసి కృతజ్జతలు తెలిపానన్నారు.

సినిమా టికెట్లపై నిర్ణయం అప్పుడే
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై వివాదం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో దీనిపై పోసాని స్పందించారు. చిన్న సినిమాల నిర్మాతల నుంచి ప్రతిపాదనలు అందాకే టికెట్లధరలపై నిర్ణయం వెలువడుతుందని పోసాని తెలిపారు.
ఇవాళ మాత్రం తాను సినిమా టికెట్ల ధరపై సిఎంతో చర్చించలేదన్నారు. అలాగే భీమ్లా నాయక్ సినిమాను దృష్టిలో ఉంచుకుని సినిమా టికెట్ల ధరల జీవో ఆలస్యమవుతుందా అన్న దానిపై మాత్రం పోసాని స్పందించలేదు.

భీమ్లా నాయక్ ను టార్గెట్ చేయలేదు
పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదలైన సందర్భంగా టికెట్ల ధరలపై ప్రభుత్వం జీవో విడుదల చేయకుండా ఆపి, థియేటర్లపై ఆంక్షలు విధించడంపై పోసాని స్పందించారు. భీమ్లానాయక్ సినిమా టికెట్ల గురించి తనకు తెలియదన్నారు. తాను సినిమా వాడినే గానీ దాని గురించి మాత్రం తెలియదన్నారు. భీమ్లానాయక్ సినిమాను ఉద్దేశ పూర్వకంగా ఇబ్బంది పెట్టారని మీ దగ్గర సాక్ష్యం ఉంటే చెప్పండి నాదగ్గర లేదని పోసాని తెలిపారు.

నామినేటెడ్ పదవిస్తే తీసుకుంటా
తనకు నామినేటెడ్ పదవి ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై పోసాని స్పందించారు. అలీ తరహాలోనే తనకూ పదవి ఇస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఇస్తే చెప్పుకోవడానికి నాకేంటి సిగ్గని ప్రశ్నించారు. దీంతో పోసానికి ఇప్పట్లో పదవి ఇవ్వబోవడం లేదని అర్ధమవుతోంది. మరోవైపు సీఎం జగన్ మీద నిందలు వేసిన వాడు భూమిలో 100 అడుగులలోతుకు పాతుకుపోతాడంటూ పోసాని శాపనార్ధాలు పెట్టారు.