చంద్రబాబు 2019 అన్నారు: జగన్ లక్ష్యం 2021 : పోలవరం పూర్తి ఎప్పుడంటే..తేల్చేసిన కేంద్రం..!
ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ఎప్పుడు పూర్తవుతుందనే దాని పైన పీపీఏ అధారిటీ క్లారిటీ ఇచ్చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 65 శాతం పనులు పూర్తయ్యాయని..2019 జూన్ నాటికి గ్రావిటీ ద్వారా నీరు ఇస్తా మని ప్రకటిస్తూ వచ్చారు. ఇక, వైసీపీ అధికారంలోకి వచ్చింది. పోలవరం తొలి సారిగా సందర్శించిన ముఖ్యమంత్రి జగన్ అక్కడే సమీక్ష నిర్వహించిన తరువాత 2021 ఏప్రిల్ నాటికి ప్రాజెక్టు పూర్తి కావాలని నిర్దేశించారు. అయితే, ఇక కీలకమైన పోలవరం ప్రాజెక్టు అధారిటీ సీఈవో రాజేంద్ర కుమార్ జైన్ అసలు విషయం తేల్చేసారు. శుక్రవారం ప్రాజెక్టు క్షేత్ర స్థాయి సందర్శనకు తమ బృందం వెళ్తుందని ప్రకటించారు.

ఇప్పటి వరకు 6,700 కోట్లు విడుదల..
పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం ఇప్పటి వరకు 6,700 కోట్లు విడుదల చేసిందని పోలవరం ప్రాజెక్టు అధారిటీ సీఈఓ రాజేంద్రకుమార్ జైన్ చెప్పుకొచ్చారు. విజయవాడలో సమావేశమైన పీపీఏ సభ్యులు కాఫర్ డ్యాం రక్షణ పనులు, వరద అంచనా వ్యవస్థలపై చర్చించారు. కాఫర్ డ్యాం పాక్షికంగా పూర్తయిందని, వరదలు రాకముందే పనులు వేగవంతం చేయాలని సూచించారు. ప్రస్తుతం 10 వేల క్యూసెక్కుల వరదను అంచనా వేస్తున్నామని చెప్పారు. దీని వల్ల కాఫర్ డ్యాంకు ఇబ్బంది లేదని వివరించారు. బిల్లుల్లో కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉందన్నారు.

ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని పెంచడంపై.. కేంద్రం పరిధిలోని ఎస్టిమేషన్ కమిటీ పరిశీలిస్తోందని రాజేంద్రకుమార్ జైన్ పేర్కొన్నారు. అదే విధంగా ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని పెంచడంపై కేంద్ర పరిధిలోని ఎస్టిమేషన్ కమిటీ పరిశీలిస్తోందని.. ఈ విషయంపై ఇప్పటికే ఒక మీటింగ్ కూడా జరిగిందని తెలిపారు. పెరిగిన అంచనా వ్యయాలపై మరిన్ని వివరాలు ఇవ్వాలని ఈ కమిటీ రాష్ట్రాన్ని కోరినట్లు వెల్లడించారు.
ప్రాజెక్టుకు మరో మూడేళ్లు..
ప్రాజెక్ట్ పూర్తి కావడానికి మరో మూడేళ్ళు పడుతుందని ప్రాజెక్ట్ అథారిటీ సీఈవో రాజేంద్ర కుమార్ జైన్ తేల్చి చెప్పారు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతీ సోమవారం పోలవారంగా ప్రకటించి రివ్యూలు నిర్వహించారు. పలు మార్లు ప్రాజెక్టను సందర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2019 జూన్ నాటికి గ్రావిటీ ద్వారా నీరు ఇస్తామని సీఎం తో సహా మంత్రి ఉమా సైతం అసెంబ్లీలో..బయటా గట్టిగా చెప్పేవారు. ఏపీలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారిని సైతం పోలవరం యాత్ర పేరుతో అక్కడకి తీసుకెళ్లేవారు. ఇక, ఏపీలో ఎన్నికల తరువాత ప్రభుత్వం మారింది.
జగన్ సీఎం అయ్యారు. గత నెలలో జగన్ పోలవరం క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు. అధికారుల తో సమీక్షించారు. 2021 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి కావాలని నిర్ధేశించారు. అయితే, పిపిఏ సీఈవో వీరిద్దరి అంచనాల తో విభేదించారు. ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో మూడేళ్ల సమయం పడుతుందని తేల్చి చెప్పారు.