కోనసీమ జిల్లా పేరు మార్పుపై ఆందోళనలు-రాళ్ల దాడిలో పోలీసులకు గాయాలు-తీవ్ర ఉద్రిక్తత
ఏపీలోని కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమగా మారుస్తూ వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇవాళ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. జిల్లా పేరు మార్పుకు నిరసనగా వందలాది యువకులు ఇవాళ అమలాపురంలో కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై నిరసనకారులు రాళ్ల దాడి చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.
కోనసీమ జిల్లా పేరు మార్పుపై ఇవాళ కొందరు చేపట్టిన ఆందోళన అదుపుతప్పింది. కోనసీమ జిల్లా పేరు మార్చవద్దంటూ కోనసీమ సాధన సమితి ఆందోళనకు పిలుపునిచ్చింది. ఆందోళనను ఆడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేశారు. పోలీసులను తప్పించుకుని కలెక్టరేట్ ముట్టడికి భారీగా ఆందోళనకారులు బయలుదేరారు. ఆందోళనకారులను చెదరగొట్టి పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులపై తిరగపడిన ఆందోళనకారులు రాళ్లు దాడికి దిగారు. ఈ సమయంలోనే జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి వాహనంపై ఆందోళనకారులు రాళ్ల దాడిచేశారు.
ఈ దాడిలో ఎస్పీ గన్ మెన్ కు గాయం అయింది.

అమలాపురం గడియారం స్తంభం సెంటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో అమలాపురం డిఎస్పీ మాధవ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. జిల్లా పేరు మార్చవద్దంటూ కోనసీమ జిల్లా సాధన సమితి ఆందోళన చేపట్టింది. కోనసీమ జిల్లా ముద్దు.. వేరే పేరు వద్దు' అంటూ వందలాది యువకులు నినాదాలు చేశారు.

అమలాపురంలో ఆందోళనకారులను వెంబడించిన పోలీసులు..కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల నుంచి తప్పించుకుని యువకులుపరుగులు తీశారు. కలెక్టరేట్ వైపు పరుగులు తీసిన యువకులు అమలాపురం ఆస్పత్రి వద్దకు వచ్చేసరికి పోలీసు జీపుపై రాయి విసిరారు. దీంతో అమలాపురంలో ఆందోళనకారులను తరలిస్తున్న బస్సు అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. అమలాపురంలో క్షేత్రస్థాయిలో బందోబస్తు నిర్వహించిన ఎస్పీ సుబ్బారెడ్డికి కూడా గాయాలయ్యాయి. అమలాపురం ఏరియా ఆసుపత్రి వద్ద పోలీసులపై రాళ్లతో దాడిరాళ్ల దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న ఎస్పీ సుబ్బారెడ్డి.. అనంతరం ఆందోళనకారులను చెదరగొట్టారు.