క్విట్ జగన్: మంత్రి రోజా స్లోగన్ ను రివర్స్ చేసి చెప్పిన చంద్రబాబు; ఆసక్తికరచర్చ!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒంగోలు వేదికగా తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడులో చంద్రబాబుతో పాటు, తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మరొకవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో వైసిపి మంత్రులు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్నారు. ఏపీ అధికార ప్రతిపక్ష పార్టీ నేతల పర్యటనలు, సభలతో అప్పడే ఎన్నికల వేడి కనిపిస్తుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు రానున్న ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని ఇప్పటి నుండే ముందుకు వెళుతున్న పరిస్థితి కనిపిస్తుంది.

ప్రతి ఇంట్లోనూ క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ పై చర్చ జరగాలన్న చంద్రబాబు
ఇదిలా ఉంటే ఒంగోలు వేదికగా సాగుతున్న మహానాడు కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతోనే ఎన్నికలకు వెళతామని, ప్రతి ఇంట్లోనూ క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ పై చర్చ జరగాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్ ఇంటికి పోవడం ఖాయం అంటూ చంద్రబాబు తేల్చి చెప్పారు.

చంద్రబాబు స్లోగన్ పై ఆసక్తికర చర్చ
అవినీతి పాలన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దివాలా తీసిందని పేర్కొన్నారు. రాజకీయాల నుంచి జగన్ ను బయటకు పంపించాలని చంద్రబాబు మహానాడు వేదికగా క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ స్లోగన్ అందుకున్నారు. అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ప్రజలు ఇది ఎక్కడో విన్నాం అంటూ చర్చించుకుంటున్నారు. ఇటీవల మంత్రి రోజా క్విట్ చంద్రబాబు అంటూ ఈ స్లోగన్ చెప్పినట్టు గుర్తు చేసుకుంటున్నారు. బాబు వైసీపీ వారి స్లోగన్ నే రివర్స్ చేసి చెప్తున్నారా అని చర్చిస్తున్నారు.

గతంలోనే క్విట్ చంద్రబాబు సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ఎన్నికలకు వెళ్తాం అన్న రోజా
అయితే చంద్రబాబు చేసిన నినాదం ఇంతకుముందు వైసీపీ మంత్రి రోజా చంద్రబాబును ఉద్దేశించి చేశారు. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మంత్రి రోజా చంద్రబాబును టార్గెట్ చేసి 2024 ఎన్నికలకు క్విట్ చంద్రబాబు సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో వెళ్తామని ప్రకటించారు. రానున్న ఎన్నికలను గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రోజా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్ర బాబు కడప పర్యటన తర్వాత రోజా చంద్రబాబు టార్గెట్ గా క్విట్ చంద్రబాబు, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు.

రోజా చేసిన నినాదాన్ని రివర్స్ చేసిన బాబు ... ప్రజలు ఎవర్ని క్విట్ అంటారో?
ఇక రోజా చేసిన నినాదాన్ని చంద్రబాబు రివర్స్ చేసి క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినదించారు. క్విట్ జగన్ అంటూ చంద్రబాబు, క్విట్ చంద్రబాబు అంటూ వైసీపీ నేతలు రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఒకరిని మించి ఒకరు వ్యూహాలతో ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చంద్రబాబు, మరోమారు ఏపీలో అధికారాన్ని కొనసాగించాలని జగన్ చేస్తున్న రాజకీయ యుద్ధం ఏపీ ప్రజలకు ఆసక్తికరంగా మారింది. మరి ఇంతకీ ప్రజలు వచ్చే ఎన్నికలలో క్విట్ చంద్రబాబు అంటారా? క్విట్ జగన్ అంటారా? అన్నది తెలియాల్సి ఉంది.