
Raghurama తాజా లేఖ:పార్టీ పేరులో కాదు..గుండెల్లో పెట్టుకోండి : నన్ను రానీయకుండా భయబ్రాంతులతో ..!
వైసీపీ రెబల్ ఎంపీ ముఖ్యమంత్రి జగన్ కు వరుస లేఖలు కంటిన్యూ అవుతున్నాయి. రోజుకో అంశంతో సీఎం లేఖ రాస్తూ..అందులోని వైఫల్యాలను ప్రస్తావిస్తున్న రఘురామ, ఈ రోజు లేఖలో ప్రత్యేక అంశాలను ప్రస్తావించారు. డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ..రైతులకు ఆయనంటే ప్రాణమని..ఆయనకు కూడా రైతులంటే ప్రాణమని చెబుతూనే.. ఏపీలోని రైతులు నేడు అత్యంత తీవ్రమైన సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నారంటూ పేర్కొన్నారు.
మన ప్రభుత్వం నుంచి ఏ మాత్రం వారికి సహాయం అందడం లేదని విమర్శించారు. మనం 1.83 లక్షల మంది రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి రూ.1,619 కోట్ల మేరకు చెల్లింపులు జరపాల్సి ఉందని గుర్తు చేసారు. రఘురామ తన నియోజకవర్గంలో తిరగకుండా చేసేందుకు మీ మనుషులు పోలీసు కేసులతో అందరిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారంటూ లేఖలో విమర్శించారు. అయితేతాను మాత్రం తన నియోజకవర్గ ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నానంటూ చెప్పుకొచ్చారు.

తన నియోజకవర్గానికి చెందిన రైతులు తాము పండించిన ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ కు అమ్మారని.. అయితే ఆ శాఖ నుంచి ఇప్పటి వరకూ వారికి చెల్లించాల్సిన డబ్బులు అందలేదని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులంతా మన ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమనే స్థిరమైన నిర్ణయానికి వచ్చేశారంటూ వ్యాఖ్యానించారు. ఎలాంటి కఠినమైన నిబంధనలు లేకుండా రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని మీరు ఎంతో ఆర్భాటంగా ప్రకటించినా.. మీ మంత్రి, సంబంధిత అధికారులు మాత్రం ధాన్యంలో తడి ఉందని, తేమ శాతం పెరిగిందని రకరకాల కుంటి సాకులు చెప్పారంటూ వివరించారు.
మధ్య దళారీల ప్రమేయం లేకుండా చేయండి. ధాన్యం కొనుగోలును మరింత పారదర్శకంగా చేపట్టండని కోరారు. నేరుగా ప్రభుత్వమే చేసి మధ్యదళారులను పూర్తిగా నిర్మూలించాలని సూచించారు. నేడు రైతు దినోత్సవం సందర్భంగా నేను మిమ్మలను కోరేది ఒక్కటే..అంటూ... దయచేసి రైతుల బాధలు అర్ధం చేసుకోండి. ధాన్యం సేకరణ బకాయిలను తక్షణమే చెల్లించండి. అందుకోసం కేంద్రం విడుదల చేసిన నిధులను అందుకే వినియోగించండి. కేంద్ర ధాన్యం సేకరణ కోసం కేంద్రం ఇచ్చిన నిధులను ఇతర పథకాల కోసం మళ్లించకండి. మన పార్టీ పేరులో రైతును పెట్టుకోవడం కాదు.... రైతును మన గుండెల్లో కూడా పెట్టుకోవాలి అంటూ రఘురామ తన లేఖలో పేర్కొన్నారు.