andhra pradesh east godavari tuni ratnachal express burnt mudragada padmanabham vijayawada summons ap govt తూర్పుగోదావరి తుని ముద్రగడ పద్మనాభం విజయవాడ సమన్లు ఏపీ ప్రభుత్వం
తుని ఘటనలో ముద్రగడకు రైల్వేకోర్టు సమన్లు- ఇతర నిందితులకూ- రాష్ట్రం వదిలేసినా
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్లకు డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారి తూర్పుగోదావరి జిల్లా తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ దహనానికి కారణమైంది. అయితే వైసీపీ సర్కారు ఈ ఘటనపై గతంలో నమోదు చేసిన కేసుల్ని ఎత్తేసింది. కానీ విజయవాడ రైల్వే కోర్టులో కేసులు అలాగే ఉండటంతో తాజాగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో పాటు ఇతర నిందితులకూ సమన్లు జారీ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చినా కఠిన మైన రైల్వే చట్టాల కారణంగా ఈ కేసుల నుంచి వీరికి ఇప్పట్లో విముక్తి లభించేలా లేదు.

కాపు ఉద్యమం-తునిలో రైలు దహనం
కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి దాన్ని నిలబెట్టుకోని గత టీడీపీ సర్కారుకు వ్యతిరేకంగా కాపులు ఉద్యమించారు. 2016లో తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన రైలు రోకో సందర్భంగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సహా పలువురు కాపు ఉద్యమ నేతల పిలుపు మేరకు ఆందోళనలు జరిగాయి. ఇందులో భాగంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తుని రైల్వే స్టేషన్ సమీపంలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ను తగులబెట్టారు. ఇందులో పలు బోగీలు దహనమయ్యాయి. దీనిపై అప్పట్లో రాష్ట ప్రభుత్వంతో పాటు రైల్వే చట్టం కింద పలువురిపై కేసులు నమోదయ్యాయి.

తుని రైలు ఘటన కేసులు ఎత్తేసిన జగన్
అప్పట్లో కాపు రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమంలో భాగంగా తునిలో రైలు దహనం జరిగినప్పుడు టీడీపీ సర్కార్ నమోదు చేసిన కేసుల్ని వైసీపీ అధికారంలోకి రాగానే ఎత్తేశారు. అప్పట్లో పోలీసులు నమోదు చేసిన కేసుల్ని వెనక్కి తీసుకుంటూ వైసీపీ సర్కార్ గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేసులన్నీ వెనక్కి తీసుకున్నట్లయింది. అప్పట్లో నిందితులుగా ఉన్న ముద్రగడ పద్మనాభంతో పాటు మిగతా కాపు జేఏసీ నేతలకూ ఇది ఊరటనిచ్చింది. అయితే రైల్వే కేసులు మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

ముద్రగడ, ఇతరులకు రైల్వే కోర్టు సమన్లు
తుని దహనం ఘటనలో రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసులో నిందితులకు తాజాగా సమన్లు జారీ అయ్యాయి. అప్పట్లో రైల్వే పోలీసులు ముద్రగడతో పాటు 41 మందిపై రైల్వే చట్టంలోని 146, 147, 153, 174 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరంతా మార్చి 3న విజయవాడలోని రైల్వే కోర్టుకు హాజరుకావాలని సమన్లలో పేర్కొన్నారు. వీరిలో ముద్రగడ పద్మనాభం, మంచాల సాయిసుధాకర్ నాయుడుతో పాటు పలువురు ఉన్నారు. పాత కేసులు మరోసారి విచారణకు రావడంతో వీరిని హాజరు కావాలని కోర్టు సమన్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.

తెలంగాణ ఉద్యమ కేసుల తరహాలోనే
గతంలో తెలంగాణ ఉద్యమం సందర్భంగా 2014కు ముందు పలువురు టీఆర్ఎస్ నేతలపై రైల్వే చట్టాల కింద కేసులు నమోదు చేశారు. గతంలో టీఆర్ఎస్లో ఉండి ఇప్పుడు ఇతర పార్టీలకు ఫిరాయించిన నేతలు కూడా ఇప్పటికీ అక్కడ రైల్వే చట్టాల కింద కేసులు ఎదుర్కొంటున్నారు. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారిపైనా కేసుల విచారణ కొనసాగుతోంది. ఇదే తరహాలో తుని రైలు ఘటన కేసుల విచారణ కూడా సుదీర్ఘఁగా కొనసాగుతోంది. కేసులు నమోదు చేసి ఐదేళ్లు గడుస్తున్నా ఈ కేసుల విచారణ కొనసాగుతుండటం కాపు నేతలకు ఇబ్బందికరంగా మారింది.