హైదరాబాద్‌లో ఈదురుగాలు వర్ష బీభత్సం: మూడు కార్లు ధ్వంసం, ఇద్దరికి గాయాలు
హైదరాబాద్: నగరంలో మధ్యాహ్నం వరకు భానుడు తన ప్రతాపం చూపగా.. సాయంత్రం వరకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. మేఘాలు కమ్మేశాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం నగరంలోని పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా ఈదురుగాలులు, వర్షం పడటంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన వర్ష బీభత్సం
భారీగా ఈదురుగాలులు వీయడంతో నాంపల్లిలోని ఆర్డీవో కార్యాలయ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం నుంచి ఇనుప రేకులు ఎగిరిపడి అటుగా వెళ్తున్న వాహనాలపై పడ్డాయి. దీంతో నాంపల్లి ప్రధాన కూడలి వద్ద మూడు కార్లు ధ్వంసమయ్యాయి. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. మరోవైపు, జీడిమెట్ల, షాపూర్ నగర్, సూరారం, కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, గచ్చిబౌలి, చంపాపేట్, కర్మన్‌ఘాట్, సరూర్‌నగర్, సైదాబాద్, అంబర్ పేట్, మౌలాలి తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
పలు ప్రాంతాల్లో వడగండ్ల వానలు
పటాన్చెరు, మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, దుండిగల్‌లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో వడగండ్ల వాన పడింది. సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్ పల్లి, అల్వాల్, తిరుమలగిరి, చిలకలగూడ, మారేడుపల్లి, బేగంపేట్, ప్యారడైజ్, ప్యాట్నీ సెంటర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట యూసుఫ్‌గూడ తదితర ప్రాంతాలో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసింది.

మరో రెండ్రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు
నైరుతి రుతుపవనాలు నైరుతి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, అగ్నేయ అరేబియా సముద్రం మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతం దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు వ్యాపించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర దక్షిణ ద్రోణి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతుందని పేర్కొంది. వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు ఉరుములుమెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.