పొగాకు బోర్డు సభ్యుడిగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నియామకం
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పొగాకు బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. గత ఏడాది డిసెంబర్ 14న రాజ్యసభ సమావేశంలో ఆమోదించిన తీర్మానాన్ని అనుసరించి పార్లమెంటు సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ సభ్యుల నుంచి పొగాకు బోర్డు సభ్యునిగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని జీవీఎల్ నరసింహారావుకు రాజ్యసభ సెక్రటేరియట్ లిఖితపూర్వకంగా తెలియజేశారు.
పొగాకు బోర్డు చట్టం 1975లోని సెక్షన్ 4(4)(బి) ప్రకారం, పొగాకు బోర్డ్ రూల్స్, 1976లోని రూల్ 4(1) ప్రకారం, పొగాకు బోర్డు సభ్యునిగా ఒక రాజ్యసభ సభ్యుడిని హౌస్ సభ్యుల నుంచి ఎన్నుకుంటారు. అదే నిబంధన ప్రకారం.. ఇద్దరు లోక్సభ సభ్యులు పొగాకు బోర్డుకు కొంత కాలం కిందట ఎన్నికయ్యారు. ప్రస్తుతం బండి సంజయ్ (తెలంగాణ), బాలశౌరి (ఆంధ్రప్రదేశ్) లోక్సభ నుంచి పొగాకు బోర్డు పార్లమెంట్ ప్రతినిధులుగా పనిచేస్తున్నారు.

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తన ఎన్నికపై హర్షం వ్యక్తం చేస్తూ పొగాకు రైతులకు సంబంధించిన సమస్యలను లేవనెత్తడం కొనసాగిస్తానని, వారి సంక్షేమం కోసం, పొగాకు ఎగుమతులను ప్రోత్సహించడం కోసం మరింత చురుకుగా పనిచేస్తానని తెలిపారు.
జీవీఎల్ నరసింహారావు గతంలో రాజ్యసభ ద్వారా సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా ఎన్నికై సుగంధ ద్రవ్యాల రంగం వృద్ధికి దోహదపడుతున్నారు. మిర్చి జాతీయ టాస్క్ఫోర్స్ కమిటీకి ఛైర్మన్గా కూడా నియమించబడ్డారు. మిర్చి రంగంలో రైతుల, వాణిజ్యాన్ని ప్రోత్సహించడం కోసం ఆ పాత్రలో చురుకుగా పనిచేస్తున్నారు.