జగన్ను బీజేపీ టార్గెట్ చేస్తోందా : సీఎం ఇక స్వస్తి పలకాలి: ఈ పోకడలు సరికావు..!
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి వారం కూడా పూర్తి కాకుండనే బీజేపీ నేతలు జగన్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వైసీపీ ఎన్డీఏలో భాగస్వామి కాదని..ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపుతామని రెండు రోజుల క్రితం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఇప్పుడు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జగన్ కు సూచనలు చేసారు. ఇటువంటి వాటికి జగన్ స్వస్తి చెప్పాలని సూచించారు.
జగన్ స్వస్తి పలకాలి..
లౌకిక దేశంలో మతపరమైన పండుగలను ప్రభుత్వ ఖర్చులతో చేయడం తగదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. భవిష్యత్లో ఇలాంటి పోకడలకు ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్ స్వస్తి పలుకుతారని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున గుంటూరులో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన విషయం పైన ఆయన స్పందించారు. ఈ విందులో సీఎం జగన్ సైతం హాజరయ్యారు. అయితే ఇఫ్తార్ విందుకు దాదాపు రూ.1.1 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం ఉందని పేర్కొంటూ... దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన జీవీఎల్ నరసింహా రావు మతపరమైన పండుగలను ప్రభుత్వ ఖర్చుతో చేయడాన్ని వ్యతిరేకించారు. ఏపీ ప్రభుత్వం మాత్రం ఇఫ్తార్ ఖర్చు గురించి అధికారికంగా స్పందించ లేదు.

ఇఫ్తార్ ప్రతీ ఏటా నిర్వహించేదే..
అయితే, వైసీపీ నేతలు అంతర్గతంగా మాత్రం దీని పైన చర్చ ప్రారంభించారు. ప్రభుత్వ పరంగా ఇఫ్తార్ ఇవ్వటం ఇది కొత్త కాదని..ప్రతీ ఏటా ఎవరు అధికారంలో ఉన్నా నిర్వహించే కార్యక్రమం అని గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ ప్రధాని మోదీ..బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమయ్యారు. పరస్సరం సహకరించుకోవాలని వారి భేటీల్లో నిర్ణయించారు. ఎన్డీఏలో చేరేందుకు ఆహ్వానం వచ్చినా..జగన్ సున్నితంగా తిరస్కరించారు. నాలుగు రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా సైతం తాము వైసీపీ పాలనను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామన్నారు. ఇక, వారం రోజులు కూడా పూర్తి కాకుండానే జగన్ పైన సున్నితంగానే ఆరోపణలు చేయటం పైన అధికారికంగా స్పందించటానికి వైసీపీ నేతలు నిరాకరిస్తున్నారు.