
టీటీడీపై రమణ దీక్షితులు షాకింగ్ కామెంట్స్; అవినీతి రాజ్యమేలుతుందని ట్వీట్!!
తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తాజాగా మరోమారు టీటీడీ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా తిరుమలలో అంతులేని అవినీతి మాత్రమే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తిరుమల అర్చక వ్యవస్థపై ఆయన చేసిన ట్వీట్ దుమారం రేపగా, తాజాగా మరోమారు శ్రీవారి ఆలయంలో వివిధ కులాలకు చెందిన వారు వంశపారంపర్యంగా సేవలు అందిస్తూ ఉంటే వారిని తొలగించారని షాకింగ్ పోస్ట్ పెట్టారు.
షాకింగ్ పోస్ట్ పెట్టిన రమణ దీక్షితులు .. టీటీడీ పైనా ఘాటుగా
ఇంతకూ ఆయన పెట్టిన పోస్టు ఏంటంటే తిరుమల శ్రీవారి ఆలయంలో వివిధ కులాలకు చెందిన 54 సంప్రదాయ వంశపారంపర్య కుటుంబాలు స్వామివారికి సేవ చేసేవారిని గుర్తు చేశారు. యాదవులు, వెదురు బుట్టలు తయారు చేసే వారు, మట్టికుండలు తయారు చేసే కుమ్మరులు, ముగ్గులు వేసే వారు, తోటమాలి పని చేసేవారు, నేత కార్మికులు, వడ్రంగులు, స్వర్ణకారులు, స్వామివారి సేవా వాహనాలు మోసేవారు 54 సాంప్రదాయ వంశపారంపర్య కుటుంబాలు ఉండేవి అని గుర్తు చేశారు. ఇక వీరిని 30/87 చట్టంతో తొలగించారని పేర్కొన్నారు. ఇప్పుడు తిరుమలలో విపరీతమైన అవినీతి మాత్రమే ఉందని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

గతంలోనూ బ్రాహ్మణేతర శక్తులు ఉన్నాయంటూ సంచలన ట్వీట్
తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులుగా ఉన్న రమణదీక్షితులు టీటీడీలో అవినీతి రాజ్యమేలుతుంది అని ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా తిరుమలలో బ్రాహ్మణ వ్యతిరేక శక్తులు ఉన్నాయని, అర్చక వ్యవస్థను నాశనం చేసే లోగా ఆ శక్తుల పై చర్యలు తీసుకోవాలని సంచలన ట్వీట్ చేసిన ఆయన తీవ్ర దుమారం రేపారు. ఆయన చేసిన ఈ ట్వీట్ తీవ్ర వివాదానికి కారణం కావడంతో కొద్దిసేపటికే డిలీట్ చేశారు.

గతంలో రమణ దీక్షితులుకు కౌంటర్.. మళ్ళీ షాకింగ్ వ్యాఖ్యలు
ఇక రమణ దీక్షితులు అప్పుడు చేసిన వ్యాఖ్యలకు టిటిడి లో పనిచేసే పైడిపల్లి, పెద్దింటి , తిరుపతమ్మ, గొల్లపల్లి కుటుంబాలకు చెందిన అర్చకులు ఎదురు దాడి చేశారు. రమణదీక్షితులు స్వప్రయోజనాల కోసమే ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటూ వారు విరుచుకుపడ్డారు. తిరుమల శ్రీవారి కైంకర్యాలను అర్చకులు అందరూ కలిసి నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నవారు, తిరుమలలో అర్చక వ్యవస్థ సంతృప్తికరంగానే ఉందని, రమణదీక్షితులు చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని ఆయన ట్వీట్ ను కౌంటర్ చేశారు.

గతంలో చంద్రబాబు హయాంలోనూ రమణ దీక్షితులు సంచలనాలు
గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో రమణ దీక్షితులు శ్రీవారి ఆలయానికి సంబంధించి అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు . స్వామి వారి ఆభరణాల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. స్వామి వారి పోటులో కూడా తవ్వకాలు జరిపినట్టు ఆయన ఆరోపించారు . అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆయనపై పరువు నష్టం దావా వేసింది . గత ప్రభుత్వం దాఖలు చేసిన పరువు నష్టం దావాను ప్రస్తుత ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రమణ దీక్షితులు కు ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడిగా అవకాశం కల్పించింది. అంతకు ముందు టీటీడీ రమణ దీక్షితులను ఆగమ శాస్త్ర సలహామండలి సభ్యుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది .ఆపై అనూహ్యంగా రిటైర్డ్ అర్చకుల రీ ఎంట్రీ ఉత్తర్వులు ఇచ్చి మరీ స్వామి వారి కైంకర్యాలకు రమణ దీక్షితులకు అవకాశం కల్పించింది. అయినా రమణ దీక్షితులు ఇటీవల కాలంలో టీటీడీని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.
"వారాహి" పేరు వెనుక ఉగ్రస్వరూపిణి మహాశక్తి; తొలిపూజలు అక్కడే!!
"వారాహి" పేరు వెనుక ఉగ్రస్వరూపిణి మహాశక్తి; తొలిపూజలు అక్కడే!!