ఆది ఎఫెక్ట్‌తో రామసుబ్బారెడ్డికి, బైపోల్‌తో ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవులు
అమరావతి: గవర్నర్ కోటాలో ఇద్దరి పేర్లను ఎమ్మెల్సీ పదవులకు సిఫారసు చేస్తూ ఏపీ కేబినెట్ తీర్మాణం చేసింది. ఈ మేరకు గవర్నర్ కు ఆ పేర్లను పంపనున్నారు. మాజీ మంత్రులు రామసుబ్బారెడ్డి, ఎన్ఎండి ఫరూక్‌లకు ఎమ్మెల్సీ పదవులను ఇవ్వాలని కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.ఈ మేరకు త్వరలోనే వారి పేర్లను గవర్నర్‌కు పంపనున్నారు.
జగన్ఎఫెక్ట్: బెల్ట్‌షాపుల మూసివేత, కిడ్నీ బాధితులకు నెలకు రూ.2500 పెన్షన్
రాష్ట్రంలో చోటుచేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ కోటాలో మరో ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు దక్కనున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల ప్రభావంతో మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవి దక్కనుంది.
అయితే మంత్రి ఆదినారాయణరెడ్డి ఎఫెక్ట్ కారణంగా మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం దక్కనుంది. నంద్యాల ఉపఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవి దక్కనుంది.
పార్టీలో సుదీర్ఘకాలం పాటు ఉన్న వీరిద్దరికి ఎమ్మెల్సీ పదవులను కేటాయించాలని తీసుకొన్న నిర్ణయం మాజీ మంత్రుల వర్గీయుల్లో హర్షాతిరేకాలను కల్గిస్తోంది.అయితే త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ఆదేశాలు వచ్చే అవకాశాలున్నాయని పార్టీవర్గాలంటున్నాయి.

ఆది ఎఫెక్ట్ రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ
కడప జిల్లాలో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, మంత్రి ఆదినారాయణరెడ్డి కుటుంబాల మద్య సుదీర్ఘకాలం నుండి ఫ్యాక్షన్ గొడవలున్నాయి. అయితే రామసుబ్బారెడ్డి వద్దని వారించినా కానీ, టిడిపి నాయకత్వం ఆదినారాయణరెడ్డిని వైసీపీ నుండి టిడిపిలో చేర్చుకొంది. అయితే ఆనాటి నుండి రామసుబ్బారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు మంత్రిపదవిని ఆదినారాయణరెడ్డికి ఇవ్వకూడదని రామసుబ్బారెడ్డి చేసిన వినతిని పార్టీ పట్టించుకోలేదు.అయితే ఆయన ఒకానొకదశలో పార్టీ మారుతారనే ప్రచారం కూడ సాగింది. కానీ, పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించారు. ఇటీవల రెండు రోజులపాటు బాబుతో రామసుబ్బారెడ్డి సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని బాబు హమీ ఇచ్చారు. దీనికితోడు కార్పోరేషన్ ఛైర్మెన్ పదవిని కూడ ఆయనకు కట్టబెట్టే అవకాశాలున్నాయని పార్టీవర్గాలు చెబుతున్నాయి.


అనుహ్యంగా ఫరూక్‌కు ఎమ్మెల్సీ
నంద్యాల ఉప ఎన్నికలు మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవిని వచ్చేలా చేసింది. త్వరలో నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని స్థానికంగా ఉన్న నాయకులకు టిడిపి నాయకత్వం నామినేటేడ్ పదవులను కట్టబెడుతోంది. ఇందులో భాగంగానే ఫరూక్‌ను ఎమ్మెల్సీ చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకొంది. ఇటీవల టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు ఫరూక్ పిలిపించి ఈ విషయాన్ని ఆయనకు చెప్పారు..

.పార్టీ విధేయులకు పదవులు
మొదటినుండి వీరిద్దరూ కూడ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇద్దరూ కూడ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులుగా పనిచేశారు.అయితే కారణాలు ఏమైతేనేం వారిద్దరూ కూడ ఓడిపోయారు. అయినా పార్టీకి సేవ చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్సీగా వారికి పదవులను కట్టబెట్టి వారికి న్యాయం చేయాలని నాయకత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులను వీరిద్దరిని ఎంపిక చేశారు.

ఎన్నికలకు సిద్దం చేస్తున్న బాబు
పార్టీ యంత్రాంగాన్ని ఇప్పటినుండే టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు ఎన్నికలకు సిద్దం చేస్తున్నాడు. ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో ఎన్నికల వేడి ప్రారంభమైంది.ఈ మేరకు వైసీపీ చీఫ్ జగన్ అక్టోబర్ నుండి పాదయాత్రను నిర్వహించనున్నారు.రాష్ట్ర ప్రభుత్వం తాము చేపట్టిన సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరేలా ప్రచారం చేయాలని టిడిపి నిర్ణయం తీసుకొంది. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలంతా పాల్గొనాలని బాబు ఆదేశించారు. అంతేకాదు పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేయకపోతే వారిని పక్కనపెడతానని బాబు హెచ్చరించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!