గడ్డికోసం పొలానికెళ్ళిన మహిళపై అత్యాచారయత్నం; ప్రతిఘటించిందని ఏం చేశాడంటే
మహిళలను గౌరవించాలని చెప్పినా, మహిళల కోసం ఎన్నో చట్టాలు తీసుకువచ్చి మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. దేశంలో ఎక్కడో ఒక చోట నిత్యం మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. అత్యాచారాలను ప్రతిఘటించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో మహిళలు చాలామంది ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. అంతర్జాతీయ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాక్షిగా మహిళలకు రక్షణ లేదు అని చెప్పే ఓ ఉదంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

అత్యాచారానికి యత్నించిన వ్యక్తిని ప్రతిఘటించిన మహిళ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా ఎర్రా వారి పాలెం మండలం నెరబైలు పంచాయతీకి చెందిన ఓ మహిళ ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తుంది. ఆమె భర్త జీవనోపాధి కోసం కువైట్ కు వెళ్లడంతో రెండు పాడి ఆవులను మేపుకుంటూ పిల్లలను చదివిస్తోంది. ఈ క్రమంలో తాజాగా సోమవారం మధ్యాహ్నం పశువుల కోసం గడ్డి కోసుకు రావాలని పొలం వద్దకు వెళ్లిన మహిళపై ఓ కామాంధుడు అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశాడు. తనపై అత్యాచార యత్నానికి పాల్పడిన కామాంధుడిని మహిళ తీవ్రంగా ప్రతిఘటించింది.

మహిళను చంపేసి బావిలో పడేసిన వ్యక్తి
దీంతో అతడు ఆమె గొంతు నులిమి ప్రాణాలు తీశాడు. తన కామవాంఛ తీర్చలేదని ఆమెను హతమార్చాడు. ఆపై ఎవరూ చూడకుండా 100 మీటర్ల దూరంలో ఉన్న పాడుబడిన బావిలో శవాన్ని పడేసాడు. బావిలో శవాన్ని చూసిన పక్క పొలానికి చెందిన వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బావిలో నుండి శవాన్ని వెలికితీసి, అక్కడ అన్ని ఆధారాలను సేకరించారు. డాగ్ స్క్వాడ్ తో పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు.

దిక్కు తోచని స్థితిలో ఉన్న ఇద్దరు చిన్నారులు
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి కువైట్లో ఉండగా, తల్లి మృతిచెందడంతో ఇద్దరు పిల్లలు అనాధల్లా తల్లికోసం రోదిస్తున్నారు. ఏం చేయాలో దిక్కుతోచక కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కువైట్ లో ఉన్న భర్తకు సమాచారం అందించడంతో పాటు, హత్యకు సంబంధించి అనుమానం ఉన్న మృతురాలి సమీప బంధువును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

ప్రశ్నార్ధకంగా చిన్నారుల భవిష్యత్
కామంతో కళ్లు మూసుకుపోయి మహిళ ప్రాణాలు తీసిన సదరు కామాంధుడు పోలీసుల విచారణతో చట్టం ముందు దోషిగా నిలబడే విషయం అటుంచి, అతని కామవాంఛ ఇద్దరు చిన్నారులకు తల్లిని లేకుండా చేసిందనేది అత్యంత బాధాకరమైన అంశం. ఉపాధి కోసం వెళ్లిన తండ్రి వేరే దేశంలో, తల్లి తిరిగిరాని లోకంలో ఉన్నవేళ దిక్కుతోచని స్థితిలో ఉన్న చిన్నారుల ఆలనా పాలనా చూసే వారు ఎవరు? వారి భవిష్యత్ ఏంటి అన్నది? ప్రశ్నార్థకంగా మారింది. ప్రతి దినం చోటుచేసుకుంటున్న ఇటువంటి అనేక ఘటనలు మహిళల భద్రతను ప్రశ్నిస్తున్నాయి. మహిళల విషయంలో మారని పురుషుల వైఖరిని నిలదీస్తున్నాయి.