వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ ఒప్పుకున్నారా, ఆజాద్ ఎందుకు తగ్గారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

 Rayala Telangana to give shock to KCR?
హైదరాబాద్: రాయల తెలంగాణకు పట్టుబడుతూ వచ్చిన జీవోఎం సభ్యుడు, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ ఎందుకు వెనక్కి తగ్గారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మజ్లీస్ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీని సంతోషపెట్టడానికి ఆజాద్ రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు చెబుతున్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన ముందుకు రావడంతో తెలంగాణకు చెందిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను హడావిడిగా ఢిల్లీకి పిలిపించి ఆయనను ఒప్పించినట్లు సమాచారం. రాజనర్సింహ కూడా దానికి సరేనని చెప్పినట్లు చెబుతున్నారు. ఆయన చేత పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పించి, ముందుకు వెళ్లాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

దామోదర రాజనర్సింహను అంగీకరింపజేస్తే తెలంగాణకు చెందిన తమ పార్టీ నాయకులంతా అంగీకరిస్తారని ఆజాద్ అనుకుని ఉంటారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తేవడానికి ఆజాద్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో మాట్లాడి ఉంటారా అనేది ప్రశ్న. అయితే, కెసిఆర్ అంగీకరించడం వల్ల రాయల తెలంగాణకు ముందుకు వెళ్లడానికి నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారంటూ కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గురువారంనాడు అన్నారు.

రాయల తెలంగాణకు కెసిఆర్ అంగీకరించారని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. సోనియా, కెసిఆర్ ఒప్పందంలో భాగంగానే రాయల తెలంగాణ ముందుకు వచ్చిందని ఆయన అన్నారు. అయితే, కెసిఆర్ అంగీకరించారా, లేదా అనేది ముఖ్యం కాకపోయినప్పటికీ ఆజాద్ తెచ్చిన ప్రతిపాదన తీవ్రంగానే సంచలనం సృష్టించింది. అయితే, ఆంత సులభంగా కెసిఆర్ దానికి అంగీకరించారని చెప్పడానికి కూడా వీలు లేదు. కెసిఆర్‌ను కూడా దెబ్బ తీయడానికే ఆ ప్రతిపాదనను కాంగ్రెసు అధిష్టానం ముందుకు తెచ్చిందనే వాదనకే బలం చేకూరుతోంది.

రాయల తెలంగాణకు తెలంగాణనలోని అన్ని వర్గాల నుంచే కాకుండా కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకుల నుంచి కూడా వ్యతిరేకత ఎదురు కావడంతో కెసిఆర్ ఆందోళనకు పిలుపునిచ్చారు. గురువారం బంద్‌కు పిలుపునిచ్చారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం వల్లనే కాకుండా కెసిఆర్ ఆందోళనకు పిలుపునివ్వడం వల్ల కూడా ఆజాద్ వెనక్కి తగ్గి ఉండవచ్చునని భావిస్తున్నారు.

రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను కలుపుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం వల్ల శాసనసభలో ముసాయిదా బిల్లును సాధారణ మెజారిటీతో నెగ్గించుకోవచ్చుననే ఎత్తు కూడా ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ విమర్శించారు. రాజధాని సమస్య వల్లనే రాయల తెలంగాణను ముందుకు తెచ్చారంటూ రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ చెబుతూ తాను రాయల తెలంగాణకు వ్యతిరేకమని చెప్పారు. రాయల తెలంగాణ ప్రతిపాదనపై రాయలసీమ పరిరక్షణ పార్టీ నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు.

ఆ వ్యతిరేకత అటు వైపు ఉండగా, బిజెపి కూడా తీవ్రంగా వ్యతిరేకించడం కూడా ఆజాద్ వెనక్కి తగ్గడానికి కారణమైందని అంటున్నారు. బిజెపి మద్దతు లేకుంటే తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడం కష్టమవుతుంది. దీంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నికల లోగా ఏర్పాటు చేయాలనే కాంగ్రెసు అధిష్టానం వ్యూహం బెడిసికొట్టే పరిస్థితి వచ్చింది. దీంతో ఆజాద్ వెనక్కి తగ్గక తప్పలేదని అంటున్నారు.

English summary
It is said that Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar rao ahs accepted for Rayala Telangana. But reversed his stand with the opposition from all corners.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X