జలదీక్ష: వ్యూహాత్మకంగా జగన్ రాయలసీమ తంత్రం
హైదరాబాద్: తన పార్టీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలోకి మారుతున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ మంత్రాన్ని జపిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా వేదికగా జగన్ జలదీక్ష చేస్తున్నారు.
జగన్ దీక్ష పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్ని కలిగించింది. రాయలసీమకు అన్యాయం జరుగుతుందనే భావన మొగ్గ తొడుగుతున్న స్థితిలో ఆయన దీక్షకు ఇతర జిల్లాల నుంచి కూడా రైతులు తరలివచ్చారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల వల్ల రాయలసీమ ఎడారిగా మారుతుందని, కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని జగన్ అంటున్నారు.
Photos: జగన్ జలదీక్ష
జగన్ ఏడాది తర్వాత తొలిసారిగా రాయలసీమకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రధానంగా ప్రస్తావించడం స్పష్టమైన రాజకీయ వ్యూహం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పట్టిసీమను జగన్ వ్యతిరేకించారు. అప్పట్లో ఆ పార్టీ ఉప నేతగా ఉన్న జ్యోతుల నెహ్రు సమర్థించారు. అది చర్చనీయాంశంగా మారింది.

అయితే, తాము పట్టిసీమకు వ్యతిరేకం కాదని, పట్టిసీమ నీటిని రాయలసీమకు ఎలా తీసుకువస్తారో చెప్పాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సర్దుబాటు ధోరణితో మాట్లాడింది. తన జలదీక్షకు జగన్ కర్నూలును ఎంచుకోవడం వెనక రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు.
రాయలసీమ ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని కాపాడుకునే వ్యూహంతోనే జగన్ తన జలదీక్షలో రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఎంపి బుట్టా రేణుక, పార్టీ నేత అనంతవెంకట్రామిరెడ్డి తదితరులు కూడా రాయలసీమకు జరుగుతున్న నీటి అన్యాయం గురించే, దీక్షలో ఎక్కువగా మాట్లాడడం ఆ విషయాన్నే పట్టిస్తోంది.
రాయలసీమలో తన ప్రాబల్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో చంద్రబాబు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని, దానికి అడ్డుకట్ట వేయాలని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందువల్లనే ఆయన కర్నూలు వేదిక జలదీక్ష చేపట్టి రాయలసీమకు జరిగే అన్యాయాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లు కనిపిస్తోంది.
దానితోపాటు సొంత సామాజికవర్గానికి చెందిన వారే టిడిపిలో చేరుతున్నారన్న భావనను తుంచివేయాలంటే, మళ్లీ రెడ్డి వర్గంపై పట్టు, అభిమానం సంపాదించాల్సిన అవసరాన్ని జగన్ గుర్తించినట్లు చెబుతున్నారు. రాజ్యసభ ఎన్నికల నాటికి మరికొందరు రాయలసీమ ఎమ్మెల్యేలు వెళ్లిపోతారన్న ప్రచారం నేపథ్యంలో తాను రాయలసీమ సమస్యలపై పోరాడుతుంటే ఎమ్మెల్యేలు తనకు అండగా నిలవకుండా పార్టీ ఫిరాయిస్తు, రాయలసీమకు ద్రోహం చేస్తున్నారన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం, దేవాదుల, తుపాకులగూడెం, సీతారాంపూర్, భక్తరామదాసు ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మిస్తున్నా చంద్రబాబు వౌనంగా ఉండటం క్షమించరాని నేరమని, రాష్ట్రం ఎండిపోతే దానికి బాబే బాధ్యుడంటూ జగన్ విమర్శలు చేయడం ప్రారంభించారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి తెలంగాణపై చంద్రబాబు విమర్శలు చేయడం లేదనే విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా జగన్ ప్రధానోద్దేశ్యంగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications