రామతీర్థంలో విగ్రహాల పునఃప్రతిష్ఠ - అశోక్ గజపతి గైర్హాజరు : దేవునితో రాజకీయాలంటూ..!!
ఏపీలో కొంత కాలం క్రితం రాజకీయంగా సంచలనానికి కారణమైన రామతీర్ధంలో తిరిగి విగ్రహాలను ప్రతిష్ఠించారు. రామతీర్ధంలో రాముడి విగ్రహం ధ్వసం చేయటంతో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన విమర్శలు చేసాయి. బీజేపీ ఆందోళకు దిగింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఒకే రోజు రామతీర్దకు రావటంతో ఆ రోజున ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇక, ప్రభుత్వ నాడు ఇచ్చిన హామీ మేరకు పునఃనిర్మించిన రామతీర్థం కోదండరామాలయాన్ని మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ ప్రారంభించారు.
ఆలయంలో రుత్వికులు శాస్త్రోక్తంగా విగ్రహాల పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. అయితే, ఈ కార్యక్రమానికి దేవాలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు గైర్హాజరయ్యారు. 2020 డిసెంబర్లో సీతారామ విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో రూ.3కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఆలయాన్ని పునఃనిర్మించింది. 4 నెలల్లో ఆలయం నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేశామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దేవుడి పేరుతో ప్రతిపక్షాలు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. దేవుడి పేరుతో ప్రతిపక్షాలు రాజకీయాలు మానుకోవాలని పేర్కొన్నారు.

విగ్రహం ధ్వంసం చేసిన వారికి తప్పకుండ శిక్ష పడుతుందన్నారు. దేవునితో రాజకీయాలు చేయడం మానుకోవాలని, దుశ్చర్యలకు పాల్పడ్డ వారిని ఆధారాలతో నిరూపించడానికి విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. వచ్చే శ్రీ రామనవమి రామతీర్థంలో రాష్ట్ర అధికారిక నవమి ఉత్సవాలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కోరుతున్నామని మంత్రి బొత్సా సత్యనారాయణ చెప్పుకొచ్చారు. ఆగమ పండితులు నిర్ణయించిన ముహూర్తానికి ఆలయ ప్రతిష్ట జరిగిందని తెలిపారు. సంప్రదాయం ప్రకారం కార్యక్రమం జరిగిందని చెప్పారు. దీంట్లో రాజకీయ కోణం చూడకూడదని అన్నారు. భద్రాచలం సంప్రదాయాలతోనే రామతీర్థ ఆలయంలో పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు.