రోజా ఎందుకు నోరు విప్పటం లేదు: ఆయేషా మీరా తల్లి ఫైర్ : రీ పోస్టుమార్టం ఆరంభం..!
12 ఏళ్ల క్రితం జరిగిన హత్య లో ఈ రోజు రీ పోస్టు మార్టం జరుగుతోంది. పుష్కర కాలంగా తెలుగునాట సంచలనం కలిగించిన బీ.ఫార్మసీ విద్యార్థిని అయేషామీరా మృతదేహానికి రీ పోస్టు మార్టం ప్రారంభమైంది. తెనాలిలోని చెంచుపేట స్మశాన వాటికలో రీపోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. 2007 డిసెంబర్ 27వ తేదీన ఇబ్రహీంపట్నంలోని ప్రైవేటు హాస్టల్లో అయేషా మీరా హత్య జరిగిన విషయం తెలిసిందే. హత్య జరిగిన 12 సంవత్సరాల తర్వాత రీ పోస్టుమార్టం కేసు సిబిఐకి అప్పగించినందున ఆధారాల కోసం రీ పోస్టు మార్టం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయేషా తల్లి షంషాద్ బేగం వైసీపీ ఎమ్మెల్యే రోజా పైన కీలక వ్యాఖ్యలు చేసారు. హత్య నిందితులు ఎవరో తమకు తెలుసని వ్యాఖ్యానించారు.నాడు తమ వాదనకు మద్దుగా నిలిచి..ఇప్పుడు రోజా ఎందుకు స్పందించరని నిలదీసారు.
జనసేన ఎమ్మెల్యే తాజా వ్యాఖ్యల కలకలం: వంశీ బాటలోనే..! అధినేత సమర్ధతక పరీక్షగా..!

రోజా ఎందుకు స్పందించరు..
ఆయేషా మీరా హత్య కేసులో ఆనాడు తమకు మద్దతుగా నిలిచిన ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ఆయేషా మీరా షంషాద్ బేగం నిలదీసారు. నాడు తమ పక్షాన నిలబడి పోరాడిన రోజా..ఇప్పుడు అసలు స్పందించటం లేదన్నారు. తాము తొలి నుండి ఆరోపిస్తున్నట్లుగా హత్యకు కారకులు ఎవరో అందరికీ తెలుసంటూ వ్యాఖ్యలు చేసారు. ఒక వర్గం వారి పైన దాడులు జరిగితేనే
స్పందిస్తారా అని ప్రశ్నించారు. ఏపీలో ఆయేషా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేసారు. రీపోస్టుమార్టం తమ మత ఆచారాలకు విరుద్ధమని... అయినప్పటికీ కేసు విచారణ ముందుకు సాగేందుకు రీపోస్టుమార్టంకు ఒప్పుకున్నామన్నారు. తమ కుమార్తె హత్య కేసులో దోషులకు శిక్ష పడాలనే ఇందుకు అంగీకరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

రీ పోస్టుమార్టం ఆరంభం..
పన్నెండేళ్ల కిందట దారుణ హత్యాచారానికి గురైన ఆయేషా మీరా దేహానికి మరోసారి పోస్టుమార్టం ఆరంభమైంది. రీ పోస్టు మార్టం చేసేందుకు కోర్టు అనుమతినివ్వటం... కుటుంబ సభ్యులకు తెలపడంతో పాటు వారి సమక్షంలోనే పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో తెనాలి చెంచుపేటలోని ఈద్గాలో ఉన్న ఆయేషా సమాధిని తవ్వి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో డీఎన్ఏ నిర్ధారణతోపాటు, మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అప్పట్లో కోర్టుకు అందించిన ఆధారాల్లో పరీక్షించింది అసలు ఆయేషా డీఎన్ఏనేనా అనే అనుమానం సీబీఐ బృందానికి రావటంతో ఆమె డీఎన్ఏను నిర్ధారించుకునేందుకు ఆమె తల్లిదండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్ బాషాల డీఎన్ఏలను కూడా సేకరించారు. వీరితోపాటు హాస్టల్ వార్డెన్ పద్మ, ఆమె భర్త శివరామకృష్ణ, నిర్డోషిగా విడుదలైన సత్యంబాబు డీఎన్ఏలను కూడా సేకరించారు. నాడు కోర్టుకు చూపిన ఆయేషా డీఎన్ఏకు, తల్లిదండ్రుల డీఎన్ఏకు పోలిక లేకపోవటం వల్లో, మరే కారణమోకానీ, ఆయేషా మృతదేహాన్ని మళ్లీ తవ్వితీసి రీపోస్ట్‌మార్టం చేయించాలని సీబీఐ అధికారులు కోరారు.

కేసు కొలిక్కి తెచ్చేందుకేనా..
రీ పోస్టమార్టం ద్వారా కేసులో కొంత అవగాహన కలిగే అవకాశం ఉందని, కేసు ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ దారుణం వెనుక అప్పటి మంత్రి కోనేరు రంగారావు మనుమడు సతీష్, అతడి మిత్రులు ఉన్నారని షంషాద్ బేగం ఆరోపించారు. హాస్టల్ వార్డెన్, ఆయేషా ఉండే అంతస్తులో ఉంటున్న విద్యార్థినులపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. కోనేరు సతీష్, అబ్బూరి గణేష్, సురేష్, చింతా పవన్, రాజేష్, కవిత, సౌమ్య, ప్రీతి, హాస్టల్ వార్డెన్ పద్మ, ఆమె భర్త శివరామకృష్ణను విచారించాలని ఆయేషా తల్లి పలుమార్లు పట్టుబట్టారు. పోలీసులు అప్పట్లో దీనిని పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా అనాసాగరానికి చెందిన పిడతల సత్యంబాబును దోషిగా చేర్చి కోర్టులో హాజరు పరిచారు. విచారణ జరిపిన మహిళా న్యాయస్థానం సత్యంబాబును దోషిగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీనిపై హైకోర్టులో అప్పీలు చేయటం, తర్వాత సిట్ దర్యాప్తు జరపడం, అప్పటికీ కేసు తేలకపోవటం, అదే సమయంలో హైకోర్టు సత్యంబాబును ఈ కేసులో నిర్దోషిగా తేల్చి విడుదలచేయటం జరిగిపోయాయి. ఈ కేసును తిరిగి విచారణ చేపట్టాలని సీబీఐకి అప్పగించారు.