వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాయల తెలంగాణ ఎందుకు?: కృష్ణా నీళ్లు, రాజధాని

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వచ్చిన రాయలసీమ కాంగ్రెసు నేతలు విభజనను అంగీకరిస్తూ రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. జివోఎం నివేదికను తయారు చేసి, తెలంగాణ ముసాయిదా బిల్లును రూపొందించే దశకు విభజన ప్రక్రియ చేరుకుంది. ఇటువంటి స్థితిలో మరోసారి రాయల తెలంగాణ ప్రతిపాదనపై కేంద్ర కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వంటివారు పట్టుబడుతున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపి రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలని వారు ప్రతిపాదిస్తున్నారు.

కృష్ణా నదీజలాలపై బ్రిజేష్ కమిటీ తీర్పు వెలువరించిన నేపథ్యంలో వారి డిమాండులోని ఆంతర్యం మరింత స్పష్టంగా వెలుగులోకి వస్తోంది. రాజధాని, కృష్ణా నదీ జలాల కారణంగానే వారు రాయల తెలంగాణ డిమాండ్‌ను ముందుకు తెస్తున్నట్లు అర్థమవుతోంది. రాజధాని వివాదం కారణంగానే రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తెస్తున్నారని కర్నూలు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

రాయల తెలంగాణ ప్రతిపాదనను రాయలసీమ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆయన కర్నూలులో రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. టిజి వెంకటేష్ అభిప్రాయం కూడా అదే. కర్నూలులో రాజధానిని ఏర్పాటు చేయాలని అడిగితే విభజనను అంగీకరిస్తున్నారనే విమర్శలు చేస్తున్నారని ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు.

మద్రాసు రాష్ట్రం నుంచి హైదరాబాద్ విడిపోయిన సందర్భంలో రాయలసీమ, కోస్తాంధ్ర మధ్య శ్రీబాగ్ ఒడంబడిక జరిగింది. ఈ ఒడంబడికను బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఇప్పుడు ముందుకు తెస్తున్నారు. దాని ప్రకారం రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వల్ల తాము రాజధానిని కోల్పోయామనే ఆవేదన రాయలసీమ నేతల్లో ఉంది.

ఓవైపు విభజనను వ్యతిరేకిస్తూ కోస్తాంధ్ర నాయకులు రాజధాని ఏర్పాటు విషయంలో కొన్ని ప్రతిపాదనలు పెడుతున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నంలో సీమాంధ్ర రాజధానిని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ బహిరంగంగానే కోరారు. రాజధానిని విజయవాడలో ఏర్పాటు చేయాలని కొందురు, గుంటూరును రాజధానిగా చేయాలని మరికొందరు, విజయవాడ - గుంటూరు మధ్య మంగళగిరిలో ఏర్పాటు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రతిపాదనల్లో రాయలసీమ ప్రస్తావన రావడం లేదు. రాయల తెలంగాణను ప్రతిపాదించడంలోని ఆంతర్యం అది కూడా ఒక్కటి.

కాగా, రాయలసీమలోని చాలా ప్రాజెక్టులను కృష్ణా నది మిగులు జలాల మీద ఆధారపడి నిర్మించారు. ఎన్టీఆర్ ప్రభుత్వం మిగులు జలాలపై ఆధారపడి ప్రాజెక్టులు చేపట్టారని, మిగులు జలాలపై హక్కును వదులుకుంటామని వైయస్ రాజశేఖర రెడ్డి లేఖ రాశారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అంటున్నారు. కృష్ణానదిపై తెలంగాణకు నికర జలాలు కూడా అందడం లేదనే విమర్శ ఉంది. అందువల్ల తెలంగాణకు మిగులు జలాల సమస్య లేదు. మిగులు జలాలతో పాటు తెలంగాణకు కేటాయించిన నికర జలాలు కూడా రాయలసీమ ప్రాజెక్టులకు తరలిపోతున్నాయనేది తెలంగాణ నాయకుల విమర్శ.

రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ జలాలకు ముప్పు వాటిల్లుతుంది. తెలంగాణకు తనకు సంక్రమించిన నికర జలాలను పూర్తి వాడుకోవడానికి చూస్తే రాయలసీమ ప్రాజెక్టులకు నీరు అందని పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణతో కలిసి ఉండడం వల్ల ఆ నీటిని ఇప్పటిలాగే వాడుకోవచ్చుననేది రాయలసీమ నాయకుల ఆలోచన. అందుకే కర్నూలు, అనంతపురం జిల్లాల నాయకులు రాయల తెలంగాణ ప్రతిపాదనను గట్టిగా ముందుకు తోస్తున్నారని అంటున్నారు. రాయల తెలంగాణను సమర్థించడంలో మజ్లీస్ నాయకుడు అసదుద్దీన్‌ ఓవైసీకి ఉన్న కారణంతో దానికి సంబంధం లేదు.

మిగుల జలాలపై ఆధారపడి రాయలసీమలో ఎన్టీ రామారావు ప్రాజెక్టులు చేపడితే, కోట్ల విజయభాస్కర్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వాటిని విస్తరించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వాటిని పూర్తి స్థాయిలో నిర్మించి నికర జలాలను ఖాయం చేసే చర్యకు పూనుకున్నారు. అందుకే, రాష్ట్ర విభజన జరిగితే జల వివాదాలు వస్తాయని, కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పచ్చి మంచినీళ్లు కూడా ఉండవని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వంటివారు అంటున్నారు.

ఇక, కోస్తాంధ్ర నాయకులు, ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలో నాయకులు రాష్ట్ర విభజనను పూర్తిగానే వ్యతిరేకిస్తున్నారు. అది కూడా కృష్ణా జలాలకు సంబంధించిన వ్యవహారమే. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ తనకు సంక్రమించిన హక్కు మేరకు నికర జలాలను వాడుకుంటే, కృష్ణా డెల్టాకు ఇబ్బంది ఎదరువుతుంది. ఇప్పటికే, సకాలంలో నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర విడిపోతే ఆ జలాలను నేరుగా కిందికి తీసుకుని వెళ్లడానికి వీలు కాదు. దాంతో లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివ రావు వంటి నాయకులు రాష్ట్ర విభజనను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు.

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే విభజనను సహకరిస్తామని కొంత మంది నాయకులు అంటున్నారు. బహుశా, వీరు వ్యవసాయంతో సంబంధం లేని నాయకులై ఉంటారు. హైదరాబాద్‌తో మాత్రమే జీవితం, కార్యకలాపాలు ముడిపడి ఉన్న చిరంజీవి వంటి నాయకులు హైదరాబాదును యుటి చేయాలని గట్టిగా పట్టుబడుతున్నారు. ఏమైనా, రాష్ట్ర విభజన వివాదాలమయంగా మారింది.

English summary
According to experts - the reason behind the proposal of Rayala Telangana is Krishna river water and the capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X