ఆచార్యకు, కర్ణుడికి పోలిక?
ఆచార్య సినిమా ఘోరపరాజయాన్ని కర్ణుడి చావుకు కోటి కారణాలు అన్నట్లుగా పలువురు సినీ విశ్లేషకులు పోలుస్తున్నారు. ఈ సినిమా పరాజయం దర్శకుడు కొరటాల శివను మానసికంగా బాగా కుంగదీసింది. సాధారణ హిట్లు, సూపర్హిట్లు కాకుండా నాలుగు బ్లాక్బస్టర్లు తీసిన కొరటాల శివేనా ఈ సినిమా తీసింది అంటూ సినీ ప్రేమికులంతా ఆశ్చర్యపోయారు. అసలు తప్పు ఎక్కడ జరిగిందో పోస్టు మార్టం చేయడం ప్రారంభించారు. కొందరు సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం..

కరోనాతో వాయిదా పడటమే పెద్ద మైనస్!
కరోనావల్ల సినిమా షూటింగ్ వాయిదా పడటం ఒక మైనస్‌గా మారింది. ఆ తర్వాత పలు సినిమాలు విడుదలవడం.. ఆ తరహాలో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది. వాస్తవానికి రామ్‌చరణ్ తో సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ ఆర్ఆర్ఆర్ నుంచి పిలుపు రావడంతో చరణ్ చిరంజీవితో చేయాల్సిందిగా కొరటాలను కోరారు. స్వతహాగా మొహమాటస్తుడైన కొరటాల సరే అన్నారు. వాస్తవానికి బౌండెడ్ స్క్రిప్ట్ ఉన్నప్పుడే సినిమాకు దర్శకుడు ఒప్పుకోవాలి. అక్కడే తప్పు జరిగింది.

బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండానే..
కొరటాల దగ్గర ఎప్పుడూ బౌండెడ్ స్క్రిప్ట్‌లే ఉంటాయి. మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, భరత్ అనే నేను అలాంటివి. మరో 10 బౌండెడ్ స్క్రిప్ట్‌లు ఉన్నప్పటికీ చిరంజీవి కోసం ప్రత్యేకంగా మళ్లీ ఒక కథను రాసుకోవాల్సి వచ్చింది. రచయిత అయిన కొరటాల దర్శకుడిగా పూర్తి సన్నద్ధత లేకుండానే ఆచార్యకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా స్క్రిప్ట్‌లో చిరంజీవి, రామ్‌చరణ్ ప్రతిసారి జోక్యం చేసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. దర్శకుడిగా స్క్రిప్ట్ పై పట్టు సాధించకుండానే షూటింగ్ ప్రారంభించడం ప్రధాన కారణమైంది.

ఇతర సినిమాల ప్రభావంతో..
సినిమా షూటింగ్ వాయిదా పడటం, ఆ తర్వాత పలు సినిమాలు విడుదలై రికార్డుస్థాయి విజయాలు సాధించడంతో ఆచార్యపై వాటి ప్రభావం పడింది. ఆ తరహా సన్నివేశాలను అతికించాల్సి వచ్చింది. కథానాయకుల నుంచి ఒత్తిడి లేకుండా కేవలం దర్శకుడిగా తాను అనుకున్న కథతో స్వేచ్ఛగా సినిమాను చిత్రీకరించగలిగితే ఆచార్య బాగా వచ్చేదని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కానీ నాలుగు బ్లాక్బస్టర్లు ఇచ్చిన కొరటాల శివ తన తర్వాత సినిమా మీద పూర్తిస్థాయి దృష్టిపెట్టాలని, మరో బ్లాక్‌బస్టర్ ఇవ్వాలని సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు.