
జగన్ కు మరో గుడ్ న్యూస్- హర్యానా కేసులో సుప్రీం కీలక ఆదేశాలు-ఏపీకీ మార్గం సుగమం
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న కీలక నిర్ణయాల్లో పరిశ్రమల ఉద్యోగాల్లో స్ధానికులకు 75 శాతం కోటా కూడా ఒకటి. దీనిపై అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చిన ప్రభుత్వం అమల్లో మాత్రం దూకుడుగా వ్యవహరించలేకపోతోంది. దీనికి చాలా కారణాలున్నాయి. ఇప్పుడు హర్యానాలో స్ధానికులకు అన్ని ఉద్యోగాల్లో 75 శాతం కోటా ఇస్తూ అక్కడి బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలుకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. దీంతో ఏపీలోనూ జగన్ సర్కార్ దీన్ని దూకుడుగా అమలు చేసేందుకు మార్గం సుగమమైంది.

ఏపీలో స్ధానిక కోటా ఉద్యోగాలు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడిన హామీల్లో పరిశ్రమల్లో స్ధానిక యువతకు 75 శాతం ఉద్యోగాలు కూడా ఒకటి. అధికారంలకి రాగానే దీన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేసింది. పరిశ్రమలతో చర్చించి 75 శాతం కోటా అమలు చేసే దిశగా ఒప్పించడం మొదలుపెట్టింది. దీంతో కొత్తగా పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు జంకుతున్నారు. బయటికి చెప్పకపోయినా ఏపీ ప్రభుత్వం ఆంక్షలతో కొత్త పరిశ్రమలపై ప్రభావం పడుతోంది. దీంతో ప్రభుత్వం కూడా తమ నిర్ణయంపై వెనక్కి తగ్గలేక, అలాగని పారిశ్రామికవేత్తల్ని ఒప్పించలేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

హర్యానాలో 75 శాతం స్ధానిక కోటా
హర్యానా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక అభ్యర్థుల ఉపాధి చట్టం 2020ని గత ఏడాది నవంబర్లో ఆమోదించింది. దీని ప్రకారం 75శాతం ఉద్యోగాలు స్ధానిక యువతకే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది గరిష్టంగా నెలవారీ జీతం లేదా రూ.30,000 వేతనాన్ని అందించే ఉద్యోగాలకు వర్తిస్తుంది. దీనిపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. హైకోర్టులో పిటిషన్లు కూడా పడ్డాయి. దీంతో స్ధానిక కోటాకు వ్యతిరేకంగా పంజాబ్,హర్యానా హైకోర్టు తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ బీజేపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది.

స్ధానిక కోటాకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
స్థానిక అభ్యర్థులకు ప్రైవేట్ ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్లు కల్పించే హర్యానా చట్టంపై పంజాబ్,హర్యానా హైకోర్టు విధించిన మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. అయితే, ఈ సమయంలో వివాదాస్పద కొత్త చట్టాన్ని అనుసరించకూడదని నిర్ణయించుకున్న ప్రైవేట్ రంగ యజమానులపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని హర్యానా ప్రభుత్వానికి స్పష్టంచేసింది. ఈ అంశంపై సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపి తీర్పు ప్రకటించాలని హైకోర్టుకు కూడా సూచించింది.

జగన్ సర్కార్ కు ఊరట
హర్యానాలో 75 శాతం స్ధానిక కోటా అమలుపై హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తేయడం ఇప్పుడు ఏపీ సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఈ నిర్ణయం అమలుకు కూడా దారులు తెరిచింది. ఇప్పటికే ఈ స్ధానిక కోటాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పరిశ్రమలతో పాటు ఇతరులకు కూడా సుప్రీంకోర్టు తీర్పు షాక్ గా మారింది. అలాగే ఈ నిర్ణయం అమలుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వానికి ఊరటగా నిలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏపీలో ప్రభుత్వం 75 శాతం స్దానిక కోటాపై దూకుడుగా ముందుకు వెళ్లేందుకు కూడా అవకాశం లభిస్తోంది.