
రఘురామకు భారీ ఊరట-అట్రాసిటీ కేసులో హైకోర్టు స్టే-తదుపరి చర్యలపై
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఏపీ ప్రభుత్వం నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇవాళ ఆయనకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనపై తదుపరి చర్యలు తీసుకోకుండా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈ కేసులో ఆయనకు తాత్కాలికంగా ఇబ్బందులు లేనట్లే.
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు తనను దూషించారంటూ వచ్చిన ఫిర్యాదుపై పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పీఎస్ లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎలాంటి దూషణలు చేయకపోయినా తనపై ఏకంగా అట్రాసిటీ కేసు పెట్టారంటూ రఘురామరాజు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. విచారణలో భాగంగా రఘురామ తరఫు న్యాయవాది వెంకటేష్... సీఐడీ డీజీ సునీల్‌కుమార్ బంధువు తన క్లయింట్ పై కేసు నమోదు చేశారంటూ.. హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రఘురామ ఎలాంటి దూషణలు చేయకపోయినా కేసు నమోదు చేశారని లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. సాక్ష్యాధారాలు లేకుండా కేసు నమోదు చేశారంటూ లాయర్ వాదనలు వినిపించారు. దీంతో ఇరువురి వాదనలు విన్న హైకోర్టు.. ఈ కేసులో తదనంతర చర్యలపై స్టే ఇచ్చింది. ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.

వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే పోరు చేస్తున్న రఘురామరాజుపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ ఎంపీలు ఇప్పటికే లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. దీన్ని ఆయన ప్రివిలేజ్ కమిటీకి కూడా పంపారు. మరోవైపు తనపై అనర్హత వేటు వేయించలేకపోతే తానే రాజీనామా చేసి ఉపఎన్నిక ఎదుర్కొంటానని రఘురామ కూడా ఈ మధ్య సవాళ్లు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో అట్రాసిటీ కేసులో ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించి ఊరట పొందారు.