నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షార్‌లో దొంగలు పడ్డారు: రాకెట్‌లో ఉపయోగించే పేలుడు పదార్ధాలు ఎత్తుకెళ్లారు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో చోరీ కలకలం సృష్టించింది. అత్యంత కీలకమైన, విలువైన, పేలుడు పదార్దాలు దాచి ఉంచే మ్యాగజైన్ భవనం తాళాలు పగలగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించారు. అయితే దొంగలు పడిన విషయం బయటకు పొక్కకుండా షార్ యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుంది.

వందల మంది సెక్యూరిటీ సిబ్బంది నిత్యం కాపలా ఉన్నప్పటికీ చోరీ జరగడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఉగ్రవాదుల దాడులు ఉండవచ్చని కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు వరుసగా హెచ్చరికలు జారీ చేస్తున్న తరుణంలో... ఓ విజిలెన్స్‌ అధికారి పర్యవేక్షణలో ఉండే షార్‌లో దొంగలు ఎలా ప్రవేశించారు.

వివరాల్లోకి వెళితే... సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో రెండో గేటు తర్వాత సౌండింగ్‌ రాకెట్‌ కాంప్లెక్స్ (ఎస్‌ఆర్‌సీ)కి వెళ్లే రహదారికి కిలోమీటరు దూరాన అడవిలో వివిధ రకాల ప్రమాదకర పేలుడు పదార్థాలు దాచే భవనం (మ్యాగ్‌జైన్‌ బిల్డింగ్‌) ఉంది. ఇందులో బుధవారం రాత్రి దొంగలు ప్రవేశించారు.

Robbery in satish dhawan space centre sriharikota, nellore

సుమారు ముగ్గురు నుంచి నలుగురు వరకు చొరబాటుదారులు గడ్డపారలు, వివిధ రకాల సామగ్రిని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. వారు తీసుకొచ్చిన సామాగ్రితో మ్యాగజైన్ బిల్డింగ్‌లోని తలుపులకు ఉన్న తాళాలను పగులగొట్టి, లోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత భవనంపైకి ఎక్కారు.

ఆ భవనంపై ఉరుములు, మెరుపులు, పిడుగుపాటుకు పడకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు. అందులో కాపర్ ప్లేట్లు, తీగలు ఉండటంతో దొంగలు వాటిని కత్తిరించుకుని వెళ్లినట్లు సమాచారం. దొంగతనం అనంతరం దొంగలు వారితో పాటు తీసుకొచ్చిన గడ్డపారలు, ఇతర సామగ్రిని మాత్రం మ్యాగ్‌జైన్‌ బిల్డింగ్‌‌లోనే వదిలివెళ్లారు.

కాగా షార్‌లో మ్యాగజైన్ బిల్డింగ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ బిల్డింగ్‌లో పేలుడు పదార్ధాలను దాచుతారు. షార్‌లో ఏమైనా ప్రమాదాలు జరిగినా, ఇతర వాటికి నష్టం వాటిల్లకుండా ఈ బిల్డింగ్‌ను నిర్మించారు. ఈ బిల్డింగ్‌లో రాకెట్ ప్రయోగానికి ఉపయోగించే పేలుపు పదార్ధాలైన ఆర్‌హెచ్‌ 125, ఆర్‌హెచ్‌ 560, సౌండ్‌ రాకెట్‌ కాంప్లెక్సు సంబంధించిన సామగ్రిని నిల్వ ఉంచుతారు.

ప్రమాదకర డిగ్నేటర్లు, రాకెట్‌ను పేల్చి వేసే పదార్థాలు ఇందులో ఉంటాయి. చిన్న నిప్పు రవ్వ రాజుకున్నా పెద్ద పేలుడు సంభవించే అవకాశం ఉంది. షార్‌లో బుధవారం రాత్రి మ్యాగ్‌జైన్‌ భవనంలో దొంగలు చొరబడిన విషయం తెలియడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

భద్రత పరంగా అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని, షార్‌లో నుంచి వెళ్లే, వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని షార్‌ డైరెక్టర్ కున్హికృష్ణన్‌ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు మ్యాగ్‌జైన్‌ బిల్డింగ్‌ను షార్‌ ఉన్నతాధికారులు, సీఐఎస్‌ఎఫ్‌ కమాండెంట్‌, తదితరులు పరిశీలించి విచారణకు ఆదేశించారు.

గతంలో కూడా షార్‌లో విలువైన కాపర్ వస్తువులను దొంగిలించి బయట అమ్ముకున్న సంఘటనలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం జరిగిన ఈ దొంగతనం కేవలం కాపర్ వస్తువులను దొంగలించడానికే వచ్చారా? లేక ఉగ్రవాదకోణం ఏమైనా ఉందా? అనేది తెలియాల్సి ఉంది.

English summary
Robbery in satish dhawan space centre sriharikota, nellore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X