రోశయ్య రాజకీయ ధురంధురుడు - సీజేఐ ఎన్వీ రమణ నివాళి : ఏపీలో మూడు రోజులు సంతాప దినాలు..!!
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య భౌతిక కాయానికి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నివాళి అర్పించారు. హైదరాబాద్ లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సీజేఐ..రోశయ్య మరణ వార్త తెలుసుకొని ఆయన నివాసానికి వచ్చారు. రోశయ్య రాజకీయ ధురంధురుడుగా పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు వివిధ పదవుల్లో సేవలు చేసిన నేతగా అభివర్ణించారు. కార్యకర్త నుంచి సీఎంగా.. గవర్నర్ గా హుందాగా వ్యవహరిస్తూ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం పొందారని సీజేఐ కొనియాడారు. ఆయన మరణం తీరని లోటన్నారు. రోశయ్య ఏనాడు హద్దు మీరి వ్యవహరించలేదని చెప్పారు.

ఏపీలో మూడు రోజుల పాటు సంతాప దినాలు
హుందాగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి అని చెబుతూ..రోశయ్య కేవలం రాజకీయ నేత మాత్రమే కాదు..కళలు-సాహిత్యం పైన అభిమానం ఉన్న వ్యక్తి అని సీజేఐ ఎన్వీ రమణ నివాళి అర్పించారు. రోశయ్య మరణం తెలుగు ప్రజలకు పెద్ద లోటు అని.. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణంతో ఏపీ ప్రభుత్వం మూడు రోజుల సంతాప దినాలుగా ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సైతం మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించటంతో పాటుగా.. ప్రభుత్వ లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలకు ఆదేశించింది.

రోశయ్య ఫాం హౌస్ లో అంత్యక్రియలు
కొంపల్లిలోని రోశయ్య ఫాం హౌస్ లో ఆదివారం మధ్నాహ్నం 1 గంటకు రోశయ్య అంత్యక్రియలు జరగనున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ రోశయ్య మరణం పట్ల ఆవేదన వ్యక్తం చేసారు. సీఎం రోశయ్య పార్థివదేహానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం కిరణ్ మాట్లాడుతూ... రోశయ్య వాగ్థాటిని తట్టుకోలేక ఎన్టీఆర్ శాసనమండలిని రద్దు చేశారన్నారు. అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలనేది రోశయ్యను చూసి నేర్చుకున్నామని తెలిపారు.

రాజకీయ నేతల నివాళి
ఏ పదవి చేసినా.. ఆ పదవికే వన్నె తెచ్చిన వ్యక్తి రోశయ్య అని కిరణ్ కుమార్ రెడ్డి కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ నేతలు రోశయ్య పార్ధివ దేహం పైన పార్టీ జెండా కప్పి నివాళి అర్పించారు. జేసీ దివాకర్ రెడ్డి.. మైసూరా రెడ్డి రోశయ్య కు నివాళి అర్పించి..కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం.. ఏపీ -తెలంగాణ మంత్రులు సైతం రోశయ్య సేవలను ..వ్యక్తిత్వాన్ని కొనియాడారు. ఈ ఉదయం రోశయ్య మరణ వార్త తెలియగానే కాంగ్రెస్ అధినేత్రి సోనియా నేరుగా రోశయ్య కుమారుడికి ఫోన్ చేసి సంతాపం వ్యక్తం చేసారు.