కేవీపీ ఎమోషనల్ -రఘువీరా కన్నీరు: గాంధీ భవన్ కు రోశయ్య పార్దీవ దేహం : రేపు అంత్యక్రియలు..!!
రోశయ్య మరణ వార్త తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆస్పత్రి వద్దకు తరలి వచ్చారు. ఆయనకు నివాళి అర్పించారు. ఆ సమయంలో రోశయ్య సుదీర్ఘ కాలం అత్యంత ఆప్తుడు మాజీ ఎంపీ కేవీపి రామచంద్ర రావు ఆస్పత్రి వద్దకు వచ్చారు. రోశయ్య ను చూసి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. రోశయ్య తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన సేవలు ఎప్పటికీ నిలిచిపోతా యని చెప్పారు. వైఎస్సార్ సైతం అభిమానించి..అన్నా అంటూ ఆప్యాయంగా పిలుచుకొనేవారని గుర్తు చేసారు.

వైఎస్సార్ ప్రభుత్వంలో పెద్దన్నగా
వైఎస్సార్ ప్రభుత్వ నిర్వహణ..ఆర్దిక వ్యవహారాల్లో రోశయ్య కీలకంగా వ్యవహరించారంటూ కేవీపీ చెప్పుకొచ్చారు. వైఎస్ కేబినెట్ లో రోశయ్య సహచర మంత్రిగా పని చేసిన రఘువీరా రెడ్డి కన్నీటి పర్యంత మయ్యారు. రోశయ్య మరణ వార్త విని ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. రోశయ్య భౌతిక ఖాయాన్ని అమీర్ పేటలోని ఆయన ఇంటికి తరలించారు. ఆదివారం ఉదయం వరకు అక్కడే ఉంచనున్నారు. ఆ తరువాత ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ కు తీసుకొస్తారు.

గాంధీ భవన్ లో సందర్శనార్ధం
పార్టీ నేతలు..కార్యకర్తల దర్శనం కోసం అక్కడ 12.30 గంటల వరకు ఉంచాలని నిర్ణయించారు. గాంధీ భవన్ తో ఆయనకు ఆరు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉందని..అందుకే అక్కడ ఆయన భౌతిక కాయాన్ని ఉంచుతున్నామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ లో ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెంటనే పార్టీ అధినేత్రి సోనియా..రాహుల్ కు సమాచారం ఇచ్చారు. రేవంత్ హైదరాబాద్ కు బయల్దేరారు. గాంధీభవన్ లో నివాళి పూర్తయిన తరువాత మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు జరగనున్నాయి.

పలువురు ప్రముఖుల నివాళి
ఇప్పటికే రోశయ్య మరణం పట్ల ఏపీ సీఎం జగన్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా పలువురు మంత్రులు... మెగాస్టార్ చిరంజీవి.. కాంగ్రెస్ పార్టీ నేతలు.. రెండు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు..లోకేశ్.. టీడీపీ ఏపీ అధ్యక్షడు అచ్చెన్నాయుడు... మాజీ మంత్రి యనమల సైతం రోశయ్య మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ఏపీలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనత రోశయ్యకే దక్కుతుందన్నారు.