రాష్ట్రాన్ని శ్మశానంలా మార్చాలనుకున్నారా?: యురేనియంపై వామపక్షాలతో చేతులు కలిపిన టీడీపీ, కాంగ్రెస్
విజయవాడ: కర్నూలు జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న యురేనియం నిక్షేపాల డ్రిల్లింగ్ పనులపై ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యాయి. యురేనియం తవ్వకాలపై ప్రభుత్వం తన వైఖరేంటో స్పష్టం చేయాలంటూ పట్టుబట్టాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై ఓ విధాన ప్రకటన చేయాలని, దీనికోసం వెంటనే అసెంబ్లీని సమావేశపర్చాలని డిమాండ్ చేశాయి. యురేనియం తవ్వకాలను నిషేధిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఓ తీర్మానాన్ని చేసిన నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం కూడా తన వైఖరిని స్పష్టం చేయాలంటూ నినదించాయి.
హైదరాబాద్ లో అక్కడ హిందువులకు మాత్రమే ప్రవేశం: దాండియా చూడాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి

6,7 తేదీల్లో కర్నూలు జిల్లాలో పర్యటన
యురేనియం తవ్వకాలపై వామపక్ష నేతలు విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి భూమా అఖిల ప్రియ (తెలుగుదేశం), వీ హనుమంతరావు (కాంగ్రెస్) సహా తొమ్మిది వామపక్ష పార్టీల నాయకులు హాజరయ్యారు. యురేనియం నిక్షేపాలను గుర్తించడానికి కర్నూలు జిల్లాలోని యాదవరం మండలంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన అణు విద్యుత్ కార్పొరేషన్ అధికారులు డ్రిల్లింగ్ పనులను చేపట్టారు. ఆళ్లగడ్డ సహా నంద్యాల, ఆత్మకూరు పరిసరాల్లోనూ నల్లమల అటవీ ప్రాంతాల్లో డ్రిల్లింగ్ నిర్వహించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీన్ని నిరసిస్తూ 6,7 తేదీల్లో తాము ఆయా ప్రాంతాల్లో పర్యటించబోతున్నట్లు సీపీఎం, సీపీఐ నాయకులు తెలిపారు.

రాష్ట్రాన్ని శ్మశానంలా మారుస్తారా?
అణుబాంబులు, అణ్వాయుధ సంపదను విస్తృతం చేసుకోవడానికే కేంద్ర ప్రభుత్వం యురేనియం నిక్షేపాలను వెలికి తీయడానికి కుట్ర పన్నిందని వారు ఆరోపించారు. దీనివల్ల ఎవరికి ఉపయోగమని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యాలు, జీవన విధానాలను కాపాడాల్సిన ప్రభుత్వం స్వయంగా యురేనియం తవ్వకాలను చేపట్టిందని అన్నారు. యురేనియం వల్ల పంట పొలాలు నాశనమౌతాయని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పీ మధు, కే రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్రాన్ని శ్మశానంగా మారుస్తుంటే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

పోలీసులను కాపాలా పెట్టి..
ఆళ్లగడ్డలో యురేనియం తవ్వకాలను అడ్డుకుంటే, పోలీసులను కాపలా పెట్టుకుని డ్రిల్లింగ్ నిర్వహిస్తున్నారని భూమా అఖిల ప్రియా అన్నారు. యురేనియం తవ్వకాలను తెలంగాణ ప్రజలు ప్రతిఘటించారని, ఇప్పుడు ఏపీ ప్రజలు ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అన్నారు. బాక్సైట్ తవ్వకాలు నిలిపివేసినట్టే, యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. యురేనియం తవ్వకాలు జరుగుతున్న గ్రామాల ప్రజలు తక్షణమే గ్రామసభలు నిర్వహించి, తవ్వకాలను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం తమ పోరాటాలతో దిగి వచ్చిందని, అలాగే ఏపీ సర్కార్ మెడ వంచుతామని అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!