RRR and KGF-2: ఎంత దారుణం: రూ.వెయ్యి కోట్లకు పైగా పిండుకున్నప్పటికీ ఇంకా సరిపోలేదంట??
ఎంత దారుణమండి... సినిమాలు విడుదలైనప్పుడు ప్రభుత్వాలతో మాట్లాడుకొని థియేటర్ టికెట్ ధరలు పెంచుకొని అభిమానాన్ని క్యాష్ చేసుకున్నారు. వెయ్యికోట్ల రూపాయలకు పైగా వసూలైనట్లు చెబుతున్నారు. అవి సరిపోక ఇప్పుడు ఓటీటీల ద్వారా కూడా పిండుకోవాలనుకుంటున్నారంటూ సినీ ప్రేమికులు మాట్లాడుకుంటున్నారు. ఇదంతా RRR, KGF-2 సినిమాల గురించే. ఈ రెండు సినిమాల నిర్మాతల వ్యవహారశైలిపై ఇప్పుడు తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగుతున్నాయి.

20వ తేదీన జీ-5లో RRR
రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్డీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్లో వచ్చిన RRR సినిమా జీ-5లో ఈనెల 20వ తేదీన ప్రసారం కాబోతోంది. కాకపోతే ఈ సినిమా నిర్మాత, ఓటీటీ సంస్థ ఇద్దరూ కలిసి ఒక ఒప్పందం ప్రకారం ట్రాన్సాక్షనల్ వీడియో ఆన్ డిమాండ్ పద్ధతిలో విడుదల చేయాలని నిశ్చయించారు. అంటే ఈ సినిమాను వీక్షించాలంటే గతంలో జీ-5 సభ్యత్వం ఉన్నప్పటికీ మరోసారి సభ్యత్వం తీసుకొని సినిమాను వీక్షించాల్సి ఉంటుంది.

అమెజాన్‌లో KGF-2
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ కథానాయకుడిగా నటించిన KGF-2 చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాను అభిమానులు వీక్షించాలంటే రూ.199 తో సభ్యత్వం తీసుకోవాలనే షరతు అమెజాన్ విధించింది. ఇప్పటికే సభ్యత్వం ఉన్నప్పటికీ మళ్లీ రూ.199 చెల్లిస్తేనే RRR చూడటానికి వీలవుతుంది.

నిర్మాతలు, ఓటీటీ సంస్థలపై అభిమానుల మండిపాటు
ఇప్పటికే ఆయా ఓటీటీల సభ్యత్వం ఉన్నవారు కూడా ఈ సినిమా చూడాలంటే మళ్లీ సభ్యత్వ రుసుము చెల్లించి సినిమా చూసేలా నిర్మాతలు, ఓటీటీ సంస్థలు ఒప్పందం కుదుర్చుకోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. భవిష్యత్తులో ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలన్నీ ఇదేకోవలో రుసుము డిమాండ్ చేస్తే అవి కూడా చూడటం మానేస్తారంటున్నారు.

మొదటికే మోసం వస్తుంది
థియేటర్లలో టికెట్ ధరలు పెంచడంవల్ల ఆచార్య, సర్కారువారిపాట చిత్రాలకు కలెక్షన్లు రాలేదు. ఫ్లాప్ అనే టాక్ వచ్చిన వెంటనే ఓటీటీల్లో చూడొచ్చనే భావనలో ప్రేక్షకులుండటంతో థియేటర్లపై ఎవరూ కన్నెత్తి చూడలేదు. పెరిగిన టికెట్ ధరలవల్ల మొదటికే మోసం వచ్చి తరుచుగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు కూడా ఈ సినిమాలకు రాకుండా పోయారు. అలాగే సభ్యత్వం ఉన్నవారు మళ్లీ సభ్యత్వం తీసుకొని ఓటీటీల్లో సినిమా చూడాలంటే ఉన్న సభ్యత్వాలు కూడా చేజారిపోయే ప్రమాదం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.