ఆర్ఆర్ఆర్ టిక్కెట్ ధర పెంపు వెనుక : చక్రం తిప్పిందెవరు : నందమూరి - మెగా క్యాంపుల్లో..!!
ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ టాక్ బాగా నడుస్తోంది. సినిమా ఇండస్ట్రీలోనే కాదు...రాజకీయంగానూ హాట్ డిస్కషన్ కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం ఊహించని విధంగా ఈ సినిమాకు ధరల పెంపుకు అనుమతి ఇచ్చింది. అందునా అన్ని క్లాసుల్లోనూ రూ 75 మేర పెంచుకొనేందుకు అధికారికంగా ఓకే చెప్పింది. అయితే, ఇంత పెద్ద మొత్తంలో పెంపు నిర్ణయం వెనుక..ఏం జరిగిందనేది ఇప్పుడు చర్చకు కారణమైంది. వకీల్ సాబ్ చిత్రం సమయం నుంచి ఏపీలో టికెట్ ధరల వ్యవహారం పైన వివాదం మొదలైంది. అది భీమ్లానాయక్ వరకు కంటిన్యూ అయింది.

ఆర్ఆర్ఆర్ టిక్కెట్ల ధరల పెంపు..
మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలో హీరోలు సీఎం జగన్ తో సమావేశం తరువాత ఈ వివాదానికి ముగింపు దొరికింది. సినిమా టిక్కెట్ల ధరల పెంపుకు సీఎం ఓకే చెప్పారు. కానీ, భీమ్లానాయక్ విడుదల సమయానికి అధికారికంగా జీవో రాలేదు. మరోసారి అది రాజకీయ వివాదంగా మారింది. ఇక, రాధేశ్యామ్ మూవీ సమయానికి జీవో విడుదల అయింది .ఆ సినిమాకు టికెట్ కు రూ 25 చొప్పున పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక, ఆర్ఆర్ఆర్ విడుదల ముహూర్తం దగ్గర పడుతోంది. దీంతో..సినిమా దర్శక - నిర్మాతలైన రాజమౌళి - దానయ్య నేరుగా సీఎం జగన్ తో చర్చించారు. సినిమాకు టికెట్ ధరల పెంపుకు అనుమతి కోరారు. దీని పైన జీవో లో చెప్పిన నిబందనల మేరకు సినిమా ఖర్చకు సంబంధించిన వివరాలు అందించారు.

ప్రభుత్వ జీవో మేరకే అంటున్నా..
అందులో జీఎస్టీ కాకుండా ఈ సినిమా ఖర్చును 336 కోట్ల రూపాయలుగా తెలిపిన నిర్మాతలు, హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్‌తో కలిపి అది 478 కోట్ల రూపాయలకు పెరిగిందని వివరించారు. అయితే, గతంలో పేదల పైన భారం పడుతుందని చాలా స్వల్పంగా టికెట్ ధరలు అమలు చేసిన ప్రభుత్వం..సినీ పరిశ్రమ కోరిక మేరకు వాటిని పెంచింది. అయితే, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ భారీ బడ్జెట్ తో చేయటంతో ఏకంగా రూ 75 వరకు అన్ని క్లాసుల పైన పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జీవో మేరకే నిర్ణయం అని చెబుతున్నారు. దీని ద్వారా కింది స్థాయి టికెట్ పైన భారంగా కనిపిస్తోంది. అయితే, ఈ నిర్ణయం తీసుకోవటంలో అటు సినీ టాప్ హీరోతో పాటుగా.. ప్రభుత్వంలోని మరో ఇద్దరు ప్రమఖులు సైతం కీలక పాత్ర పోషించారనే ప్రచారం సాగుతోంది.

పక్కా వ్యూహాత్మకంగా నిర్ణయాలు
భీమ్లానాయక్ టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వకపోవటంతో పవర్ స్టార్ అభిమానులు ఏపీ ప్రభుత్వ పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక, ఇప్పుడు తారక్ - రాం చరణ్ ఇద్దరికీ ఆర్ఆర్ఆర్ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్ తో సన్నిహితంగా ఉంటున్నారు. అదే సమయంలో అఖండ సినిమా వేళ.. బాలయ్య సైతం జగన్ తో కలవటానికి సిద్దపడ్డారంటూ మంత్రి పేర్ని నాని స్వయంగా వెల్లడించారు. బాలయ్య తన వద్దకు వస్తే రాజకీయంగా ఆయన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే కారణంతో సీఎం కలవలేదని చెప్పుకొచ్చారు. దీంతో పాటుగా తాజాగా విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇలా వరుస నిర్ణయాలతో అటు చంద్రబాబు.. ఇటు పవన్ కళ్యాణ్ పైన వైసీపీ ప్రభుత్వం మైండ్ గేమ్ అప్లై చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తో జూనియర్ ఎన్టీఆర్..మెగా ఫ్యాన్స్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నందమూరి - మెగా ఫ్యాన్స్ హ్యాపీనా
చిరంజీవి నాయకత్వంలో హీరోలు ప్రభాస్ - మహేష్ అమరావతిలో సీఎం ను కలిసిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు సైతం జాబితాలో ఉంది. కానీ, చివరి నిమిషంలో ఆయన పర్యటన డ్రాప్ అయింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇటు జూనియర్ ఎన్టీఆర్ ను మద్దతిచ్చే నందమూరి క్యాంపు..అటు మెగా క్యాంపు లోనూ ప్రభుత్వం పైన సానుకూలత కనిపిస్తోంది. ఇదంతా.. పక్కా వ్యూహాత్మకంగా వైసీపీ తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తుందనే వాదన వినిపిస్తోంది. త్వరలోనే చిరంజీవి నాయకత్వంలో తెలుగు సినీ ప్రముఖులు సీఎం జగన్ ను కలిసి అభినందించేందుకు సిద్దం అవుతున్నారు. దీని ద్వారా..సీఎం జగన్ ఎక్కడ పోగొట్టుకున్నామో..అక్కడే దక్కించుకోవాలనే నినాదం తో వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు ఎంత వరకు రాజకీయంగా కలిసి వస్తాయో చూడాలి.