కాంగ్రెస్ పనైపోయింది, కొరఢా దెబ్బలు తప్పవు: సబ్బం
హైదరాబాద్: దేశంలో కాంగ్రెస్ పార్టీని మర్చిపోయే పరిస్థితి ఏర్పడిందని జై సమైక్యాంధ్ర పార్టీ నాయకుడు సబ్బంహరి అన్నారు. విభజనతో రాష్ట్రంలోనూ కాంగ్రెస్ కనుమరుగైపోయిందని చెప్పారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు చీకటి ఒప్పందంతో రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశాయని ఆరోపించారు. ఈ చీకటి ఒప్పందం ఏమిటో బిజెపి నేత వెంకయ్య నాయుడు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బిజెపి లోకసభలో ఒకలా.. రాజ్యసభలో మరోలా వ్యవహరించిందని విమర్శించారు.
రాజ్యసభలో వెంకయ్యనాయుడు మాట్లాడిన ఒక్క అంశంపైనా కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వలేదని, అయినా బిజెపి రాష్ట్ర విభజనకు సహకరించిందని ఆరోపించారు. ఓట్ల కోసం బిజెపి స్మశానంలో పిడకల వేట కొనసాగిస్తోందని విమర్శించారు. రాష్ట్ర విభజనతో ప్రజలందరూ బాధతో ఉన్నారని, ఇంకా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయవద్దని ఆయన కాంగ్రెస్, బిజెపి పార్టీలనుద్దేశించి అన్నారు.

పార్లమెంటులో విభజన బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత కూడా సుప్రీం కోర్టులో విభజన రాజ్యాంగ బద్దంగా జరగలేదని పిటిషన్ వేశానని సబ్బం హరి తెలిపారు. గవర్నర్కు ప్రత్యేక అధికారాలు, ఆర్టికల్ 371డిని సవరించకుండా విభజన చేసినందువల్ల కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నుంచి కొరఢా దెబ్బలు తప్పవని అన్నారు. రాజ్యాంగానికి విదరుద్ధంగా చేసిన విభజనను అడ్డుకుంటుందని ఆశిస్తున్నట్లు సబ్బం తెలిపారు.
సమైక్య రాష్ట్రం కోసం ఎవరూ పోరాటం చేశారో ప్రజలకు తెలుసునని అన్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి మూడ్రోజులపాటు ఉత్తరాంధ్రలో పర్యటిస్తారని సబ్బం హరి తెలిపారు. ఆదివారం విశాఖపట్నంలో కిరణ్ కుమార్ రెడ్డి పర్యటిస్తారని చెప్పారు. సబ్బవరంలో డ్వాక్రా మహిళలు, ఎన్జివో నాయకులు, ప్రజలతో భేటీ అవుతారని తెలిపారు. అన్ని జిల్లాల్లో పర్యటిస్తామని చెప్పిన ఆయన, ఉద్యమకారులకు తమ పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 200కు పైగా స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు.