చొక్కాలు మార్చే చంద్రబాబు అన్న సజ్జల .. కేసులకు భయపడి మీరే ఆ పని చేస్తారంటూ అయ్యన్న కౌంటర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. దానికి ప్రతిగా టిడిపి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, సజ్జల రామకృష్ణారెడ్డికి కౌంటర్ ఇచ్చారు.
చంద్రబాబు జీవితమంతా కుట్రలు, కుతంత్రాలు .. లోకేష్ కు ఆ విషయం కూడా తెలీదా .. సజ్జల ఫైర్

చంద్రబాబు చొక్కాలు మార్చటంలో దిట్ట అన్న సజ్జల ..
టీడీపీ అధినేత చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మారుస్తారని, రాజకీయంగా ఎలా అదునుగా ఉంటే అలా చొక్కాలు మారుస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు గతాన్ని చూస్తే, యునైటెడ్ ఫ్రంట్ వుండగా సెక్యులర్ చొక్కా వేసుకున్నారు , పరాజయం తప్పదని తెలిసి స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా ఉండి కూడా వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ వైపు పరుగు పెట్టారు అంటూ పేర్కొన్నారు. వెంటనే చొక్కా మార్చి కాషాయవాదిగా అవతారమెత్తి బీజేపీకి జై కొట్టారని వ్యాఖ్యానించారు.

సెక్యులర్ చొక్కా , కాషాయ చొక్కా అవకాశాన్ని బట్టి మారుస్తున్న చంద్రబాబు అంటూ ఫైర్
2004లో ఎన్డీఏ ఓడిపోయినప్పుడు భవిష్యత్తులో ఎన్నడూ మళ్లీ బీజేపీతో కలవనంటూ కాషాయ చొక్కా వదిలేసి మళ్లీ సెక్యులర్ చొక్కా వేసుకున్నాడని, ఆ తర్వాత 2014లో మోడీ గాలి ఉండేసరికి మళ్లీ చొక్కా మార్చి కాషాయం పంచన చేరాడని గుర్తు చేశారు. 2019లో కాకి లెక్కలు వేసి స్థానిక జాతీయ నాయకుడిగా దేశ రక్షకుడిగా అవతరిస్తున్నట్లుగా ఫీల్ అయ్యి బోర్లా పడ్డారని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఇక తను బోర్లా పడ్డ తర్వాత తన ఎంపీలందరికీ బీజేపీలోకి పంపి మళ్లీ ఢిల్లీ కరుణ కోసం, చొక్కా మార్చడానికి అన్నట్లుగా కనికట్టు చేస్తున్నారంటూ విమర్శించారు.

సజ్జల వ్యాఖ్యలకు అయ్యన్న కౌంటర్ .. ఆ చరిత్ర మీదే అంటూ
చంద్రబాబు మళ్లీ చొక్కాను ఏ క్షణాన్నైనా మార్చగలరు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు రాజకీయంగా అవకాశాన్ని బట్టి పార్టీలు మార్చడంలో దిట్ట అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా ప్రజలకు సమాధానం చెప్పిన అయ్యన్నపాత్రుడు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళ మీద పడటం వైసీపీ చరిత్ర అని ఆరోపించారు . రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తేడా వస్తే కేంద్రంలో కూడా అధికారం వద్దనుకున్న చరిత్ర టిడిపికి ఉందని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే చంద్రబాబు ఏం చేసినా అంటూ స్పష్టం చేశారు.

వైసిపి కేసులు ముఖ్యం, టీడీపీకి రాష్ట్రం ముఖ్యం .. సజ్జలకు సమాధానం
కేసుల కోసం కేంద్రంలో అధికారంలో ఏపార్టీ ఉంటే ఆ పార్టీ పాట పాడటం వైసీపీకి అలవాటని అయ్యన్న విమర్శించారు. వైసిపికి కేసులు ముఖ్యం, టీడీపీకి రాష్ట్రం ముఖ్యం అంటూ అయ్యన్నపాత్రుడు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. యూపీఏ ప్రభుత్వం ప్రణబ్ ను రాష్ట్రపతిగా నియమిస్తే వైసీపీ మద్దతు ఇచ్చిందని, ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం రామ్నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిగా నియమిస్తే కూడా మద్దతు ఇచ్చిందని , చంచల్ గూడ జైల్లో ఉన్న సమయంలో బెయిల్ కోసం సోనియాగాంధీ చుట్టూ తిరిగారని,ఇప్పుడు మళ్లీ జైలుకు వెళ్లకుండా ఎన్డీఏ చుట్టూ తిరుగుతున్నారని అయ్యన్నపాత్రుడు వైసీపీపై విమర్శలు గుప్పించారు. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలకు తన వ్యాఖ్యలతో సమాధానం చెప్పారు.