నవరత్నాల అమలు కోసం కృషి : ప్రభుత్వ లక్ష్యాల మేరకు పని చేస్తా - నూతన సీఎస్ సమీర్ శర్మ..!!
ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియరస్ ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సీఎస్ గా పని చేసిన ఆదిత్య నాద్ పదవీ విరమణ చేసారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆదిత్మ నాద్ దాస్ కు వీడ్కోలు పలికారు. నూతన సీఎస్ కు స్వాగతం పలికారు. సమీర్ శర్మ కేంద్ర సర్వీసుల నుంచి ఏపీకి వచ్చారు. ఆదిత్య నాద్ దాస్ తరువాత సీనియర్ అయిన సమీర్ శర్మను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ వినాయక చవితి నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అదే విధంగా ప్రస్తుత సీఎస్ ఆదిత్య నాద్ దాస్ ను ప్రభుత్వ సలహా దారుగా నియమిస్తూ ఆయన సేవలను ఢిల్లీలో వినియోగించుకోవాలని నిర్ణయించింది. దీంతో..దాస్ ఈ రోజున సీఎస్ గా సమీర్ శర్మకు బాధ్యతలు అప్పగించి పదవీ విరమణ చేసారు. రేపటి నుంచి కొత్త బాధ్యతల్లోకి వెళ్లనున్నారు. నూతన సీఎస్ సమీర్ శర్మ తాను నవరత్నాల అమలు కోసం కృషి చేస్తానని చెప్పారు. సీఎస్ గా నాకు అవకాశం ఇచ్చిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. అందరి సహకారంతో పని చేస్తానంటూ చెప్పుకొచ్చారు.

అందరి సహకారంతో తాను పని చేస్తానని.. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవటంతో శక్తి వంచన లేకుండా వ్యవహరిస్తానని సమీర్ శర్మ చెప్పారు. తాను ఆదిత్యనాధ్ దాస్ తో కలిసి పని చేశానని చెప్పారు. తన సర్వీసులో చాలా మంది మంచి అధికారులతో పని చేసిన అనుభవం ఉందన్నారు. ఆదిత్య నాధ్ దాస్ రిటైర్ కావడం లేదని.. ఢిల్లీకి షిఫ్ట్ అవుతున్నారంతేనని వివరించారు. రిసోర్స్ మొబలైజేషన్ అనేది కొత్త సీఎస్ కు పెద్ద ఛాలెంజ్ గా దాస్ పేర్కొన్నారు. తాను తెలంగాణ జిల్లాల్లో పని చేసిన సమయంలో జరిగిన ఘటనలను గుర్తు చేసుకున్నారు.
తన మీద కాల్పులు జరిగాయని..అయితే, తన డ్రైవర్ తన ప్రాణాలు కాపాడాడని చెప్పారు. సెక్రటేరియేట్లో విధుల నిర్వహణ.. ఇక్కడ తీసుకునే నిర్ణయాలపై చాలా మంది జీవితాలు ఆధారపడి ఉంటాయని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం అవసరమైన పనులన్నీ ఢిల్లీలో ఉండి నెరవేర్చే ప్రయత్నం చేస్తానన్నారు. ఏ అవసరమున్నా సేవలందించడానికి సిద్దంగా ఉంటానని చెప్పారు. తాను ఢిల్లీకి సలహాదారు పదవిలో వెళ్తోన్నా.. ఏపీ అధికారులకు అసిస్ట్ చేయడమే తన బాధ్యతని స్పష్టం చేసారు.
అయితే, కొత్త సీఎస్ సమీర్ శర్మ పదవీ కాలం నవంబర్ నెలాఖరు వరకు మాత్రమే ఉంది. మరి..ఆయన పదవీ కాలం పొడిగింపు కోసం ప్రయత్నాలు సాగుతాయా..లేక, మరో సీఎస్ వైపు సీఎం చూస్తారా అనేది వేచి చూడాలి. అంతకు ముందు సచివాలయ ఉద్యోగ సంఘాలతో పాటుగా రెవిన్యూ సర్వీసు..ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేతలు దాస్ కు ఘనంగా వీడ్కోలు పలికారు.