కరోనా లక్షణాలున్నా... లీవు ఇవ్వకుండా నరకం చూపించారు... 39 ఏళ్ల బ్యాంకు ఉద్యోగి మృతి..
ఆంధ్రప్రదేశ్‌లో 39 ఏళ్ల రాజేష్ అనే ఓ బ్యాంకర్ కోవిడ్ 19తో చనిపోవడం కలకలం రేపుతోంది. కరోనా లక్షణాలతో బాధపడుతున్నప్పటికీ... అతనికి లీవు మంజూరు చేయకుండా వేధించడం వల్లే... సకాలంలో ట్రీట్మెంట్ అందక చనిపోయాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై దేశవ్యాప్తంగా పలు బ్యాంకింగ్ ఎంప్లాయిస్ యూనియన్స్ తీవ్ర స్థాయిలో స్పందించాయి. బ్యాంకు అధికారులే రాజేష్ మృతికి కారణమని,లీవు ఇవ్వకుండా అతన్ని పొట్టనపెట్టుకున్నారని ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆరోపించింది.

అసలేం జరిగింది...
రాజేష్ మృతిపై ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్(అమరావతి సర్కిల్) తిరుపతిలోని ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీకి లేఖ రాసింది. రాజేష్ పనిచేస్తున్న బ్యాంకు ఉన్నతాధికారులు కోవిడ్ 19 మార్గదర్శకాలను ఉల్లంఘించారని ఆరోపించింది. ఆ లేఖ ప్రకారం... పిట్టల రాజేష్ లక్ష్మీపురం ఎస్బీఐ బ్రాంచీ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అగస్టు 25 నుంచి అతను జ్వరంతో బాధపడుతున్నాడు. అదే బ్యాంకుకు చెందిన ఫీల్డ్ ఆఫీసర్ కూడా అనారోగ్యం బారిన పడటంతో రాజేష్ లీవు మంజూరు చేశాడు. ఆ ఫీల్డ్ ఆఫీసర్‌కి అగస్టు 28న కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది.

కరోనా లక్షణాలున్నా నో లీవ్...
రాజేష్‌లో కరోనా లక్షణాలు కనిపించడటంతో అతను కూడా లీవు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే కోవిడ్ 19 పాజిటివ్ రిపోర్ట్ వెంటనే లీవు మంజూరు చేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో జ్వరంతోనే అతను విధులకు హాజరయ్యాడు. అగస్టు 30న,అగస్టు 31న కూడా రాజేష్ హెచ్ఆర్ మేనేజర్‌ను లీవు విషయమై సంప్రదించే ప్రయత్నం చేయగా... హెచ్ఆర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రకారం... రాజేష్ లీవ్ రిక్వెస్ట్‌ను రీజినల్ మేనేజర్ తిరస్కరించారు. ప్రస్తుతం ఇద్దరు అధికారులు మాత్రమే ఉన్నందునా డిప్యుటేషన్ కుదరదని చెప్పారు.

లీవు ఇవ్వకపోవడంతో టెస్టులు చేయించుకోలేదు...
అదే బ్రాంచీకి చెందిన ఫీల్డ్ ఆఫీసర్‌కి అప్పటికే కరోనా సోకిందన్న విషయాన్ని కూడా రీజినల్ మేనేజర్ పరిగణలోకి తీసుకోలేదు. రాజేష్‌కు లీవు మంజూరు చేయకపోవడంతో అతను కోవిడ్ 19 టెస్టు కూడా చేయించుకోలేదు. ఇదే క్రమంలో సెప్టెంబర్ 1న ఆ బ్యాంకు సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ పేలడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడి కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో అదే బ్యాంకులో పనిచేసే క్యాష్ ఇంచార్జి రాజేష్‌ను కోవిడ్ 19 టెస్టుకు తీసుకెళ్లాడు.

కరోనా పాజిటివ్‌గా నిర్దారణ...
అక్కడ ర్యాపిడ్ టెస్టులో రాజేష్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో రాజేష్ అప్పటికప్పుడు తన ఉన్నతాధికారులకు ఫోన్ చేసి లీవు కావాలని కోరాడు. అయినప్పటికీ రీజినల్ మేనేజర్,హెచ్ఆర్ మేనేజర్ ఇద్దరూ లీవు ఇచ్చేందుకు నిరాకరించారు. ప్రూఫ్ కాపీని సమర్పించాలని మెలిక పెట్టారు. సెప్టెంబర్ 2న తన మెడికల్ రిపోర్టును పంపించడంతో ఎట్టకేలకు లీవు మంజూరు చేశారు. కానీ అప్పటికే రాజేష్ ఆరోగ్యం చాలావరకు దెబ్బతిన్నది.

చికిత్స పొందుతూ మృతి
చికిత్స కోసం అతను కాకినాడలోని జీజీహెచ్ ఆస్పత్రిలో చేరగా... అక్కడినుంచే ఆన్లైన్లో రివ్యూ మీటింగ్‌లకు హాజరవాలని రీజినల్ మేనేజర్ ఆదేశించారు. దీంతో రాజేష్ ఆస్పత్రి నుంచి కూడా పనిచేశాడు. అయినప్పటికీ రివ్యూ మీటింగ్స్‌లో రీజినల్ మేనేజర్ రాజేష్‌ను రకరకాలుగా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాడు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే రాజేష్ సెప్టెంబర్ 11న మృతి చెందాడు. బ్యాంకు ఉన్నతాధికారుల వేధింపులు,అలసత్వ ధోరణి వల్లే రాజేష్ ప్రాణాలు కోల్పోయాడని బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్స్ ఆరోపిస్తున్నాయి. బాధ్యులపై కేసులు నమోదు చేయకపోతే సీఎం కార్యాలయం ఎదుట నిరసనకు దిగుతామని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ డిమాండ్ చేస్తున్నాయి.