ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్- చంద్రబాబు పాత్రపై విచారణకు సుప్రీంకోర్టు ఓకే
2015లో హైదరాబాద్‌లో జరిగిన ఓటుకు నోటు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ఏసీబీ అధికారులు తాజాగా ఏ3 నిందితుడు ఉదయ్ సింహాను అరెస్టు చేశారు. ఒకప్పటి టీడీపీ నేత, ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి అనుచరుడిగా పేరున్న ఉదయ్ సింహాను ఏసీబీ అధికారులు అరెస్టు చేయడం కలకలం రేపుతుండగానే సుప్రీంకోర్టులో మరో సంచలనం చోటు చేసుకుంది.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరును 37 సార్లు పేర్కొన్నప్పటికీ నిందితుడిగా చేర్చకపోవడంపై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ కేసులో చంద్రబాబు పాత్రను తేల్చేందుకు విచారణ జరపాలని నిర్ణయించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ పిటిషన్‌పై ఇవాళ వాదనలు విన్న తర్వాత ఈ నిర్ణయానికి వచ్చింది. ఇప్పటివరకూ చంద్రబాబు పేరును ఓటుకు నోటు కేసులో చేర్చకపోవడంతో ఊరటగా భావిస్తున్న వారికి సుప్రీం నిర్ణయం షాక్‌గానే చెప్పవచ్చు.

ఈ కేసులో పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫున ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఈ కేసులో చంద్రబాబు పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ నిందితుడిగా చేర్చలేదని, ఆయన్ను కనీసం ప్రశ్నించలేదని వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన సుప్రీం ధర్మాసనం చంద్రబాబు పాత్రను తేల్చేందుకు విచారణ జరపాలని నిర్ణయించింది. అయితే విచారణను మాత్రం వచ్చే ఏడాది జూలైకు వాయిదా వేసింది. ఓవైపు తెలంగాణ ఏసీబీ అధికారులు ఓటుకు నోటు కేసులో వరుస అరెస్టులకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం ప్రభావం వారిపై ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.