జగన్ సర్కార్ కు సుప్రీం షాక్-పీడీ దెబ్బతో తీవ్ర ప్రభావం-భవిష్యత్తుపై ఆందోళన !
ఏపీలో నిధుల కొరతతో అల్లాడుతున్న వైసీపీ సర్కార్ ఎడాపెడా నిధుల్ని పీడీ ఖాతాలకు మళ్లించి వాడేసుకుంటోంది. నిబంధనల్ని ఉల్లంఘించి మరీ పీడీ ఖాతాలకు నిధులు మళ్లిస్తున్నారంటూ కాగ్ వంటి సంస్ధలతో పాటు విపక్షాలు కూడా ఆరోపిస్తుంటే ప్రభుత్వం మాత్రం లైట్ తీసుకుంటూ వచ్చింది. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు ఇదే అంశంపై కొరడా ఝళిపించింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి నిధుల్ని పీడీ ఖాతాలకు మళ్లించడంపై కన్నెర్ర చేసింది.

మళ్లింపులాంధ్రప్రదేశ్
ఏపీలో భారీ అప్పులతో సతమతం అవుతున్న వైసీపీ సర్కార్ కొత్త అప్పుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కేంద్ర, రాష్ట్ర నిధులన్నింటినీ పీడీ ఖాతాలకు మళ్లించేస్తోంది. కేంద్ర నిధుల మళ్లింపు విషయంలో ఇప్పటికే ఆర్ధికశాఖతో పాటు పలు కేంద్ర విభాగాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధుల్ని సైతం పీడీ ఖాతాలకు మళ్లించడంపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అంశంపై విపక్ష నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

మళ్లింపుపై సుప్రీం సీరియస్
వైసీపీ సర్కార్ రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధుల్ని పీడీ ఖాతాలకు మళ్లించి వాడుకోవడంపై టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున విపత్తునిర్వహణ నిధుల నుంచి ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వీటిని ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ మరోవైపు ఈ నిధుల్ని పీడీ ఖాతాలకు మళ్లించడంపై దాఖలైన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వ చర్యలు చట్ట విరుద్ధమని తేల్చిచెప్పింది.

కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు
రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధుల్ని పీడీ ఖాతాలకు మళ్లించి వాడుకోవడం చట్ట విరుద్ధంగా ప్రకటించిన సుప్రీంకోర్టు.. అలా వాడుకోవడం కుదరదని తేల్చిచెప్పేసింది. ఇప్పటికే ఏపీలో మళ్లించిన నిధుల వ్యవహారంపై తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే మళ్లించిన నిధులను విపత్తు నిర్వహణ చట్టం 2005లో నిర్దేశించిన అవసరాలకు మినహా ఇతర ప్రయోజనాలకు వినియోగించవద్దని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది. ఇకపై ఎలాంటి నిధుల మళ్లింపులూ వద్దని స్పష్టం చేసింది. ఇలా నిధులు మళ్లించడం విపత్తు నిర్వహణ చట్టం, ద్రవ్య వినిమయ చట్టాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.

జగన్ సర్కార్ కు భారీ దెబ్బ ?
వివిధ కేంద్ర పథకాలు, విపత్తు నిర్వహణ నిధుల్ని పీడీ ఖాతాలకు మళ్లించి వాడుకోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టిన నేపథ్యంలో ఇకపై వాటిని వినియోగించుకోవడానికి వీల్లేకుండా పోయింది. ఇప్పటికే ఆర్ధికంగా ఇబ్బందుల్లో కూరుకుపోతున్న ప్రభుత్వానికి ఈ మేరకు నిధుల్లో కోత పడబోతోంది. అసలే అప్పులు కూడా పుట్టని పరిస్ధితుల్లో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో నిధుల మళ్లింపూ సాధ్యం కాకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. అదే జరిగితే రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి మరింత గాడి తప్పడం ఖాయంగా కనిపిస్తోంది.