జగన్ సర్కారుకు సుప్రీం ఝలక్- ఇక వాటికి నిమ్మగడ్డ పర్మిషన్ తప్పనిసరి- మరో వార్ తప్పదా ?
ఏపీలో కరోనా కారణంగా స్ధానిక సంస్ధల ఎన్నికలు వాయిదా పడినప్పటి నుంచి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తప్పడం లేదు. కరోనా పేరుతో అర్ధాంతరంగా స్ధానిక సంస్ధల ఎన్నికలు వాయిదా వేయడంపై గుర్రుగా ఉన్న సర్కారు ఇందుకు కారణమైన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ను హడావిడిగా ఆర్డినెన్స్ తెచ్చి సాగనంపడం, తిరిగి న్యాయస్ధానాల జోక్యంతో ఆయన పదవిలోకి రావడం చకచకా జరిగిపోయాయి. అయినా వైసీపీ ప్రభుత్వానికీ నిమ్మగడ్డకూ వార్ మాత్రం ఆగడం లేదు. అప్పట్లో స్ధానిక ఎన్నికల వాయిదాను సమర్ధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం మరోసారి తోసిపుచ్చడంతో నిమ్మగడ్డదే మళ్లీ పైచేయి అయింది.

షరతులతో స్ధానిక పోరు వాయిదా
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలను కరోనా కారణంగా వాయిదా వేయాల్సి రావడంతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు. అయితే నిమ్మగడ్డ అర్ధాంతరంగా స్ధానిక పోరు వాయిదా వేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పలేదు. స్ధానిక ఎన్నికల వాయిదాను సుప్రీంకోర్టు కూడా సమర్ధించింది. అంతటితో ఆగకుండా ఎన్నికలు తిరిగి నిర్వహించే వరకూ రాష్ట్రంలో చేపట్టే అభివృద్ధి పనులకు ఎస్ఈసీ అనుమతి తీసుకోవాలని కూడా సూచించింది. దీంతో వైసీపీ సర్కారుకు డబుల్ ఝలక్ తగినట్లయింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ తిరిగి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం తలుపుతట్టింది.

నిమ్మగడ్డ అధికారాలపై సుప్రీం విచారణ...
కరోనా కారణంగా స్ధానిక పోరు వాయిదా పడిన నేపథ్యంలో తిరిగి ఎన్నికలు నిర్వహించే వరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉంచడం కష్టమని భావించిన సుప్రీంకోర్టు.. కోడ్ ఉండబోదని స్పష్టం చేసింది. అయితే కోడ్ లేకున్నా ప్రధానమైన అభివృద్ధి పనులు చేపట్టే ముందు ఎస్ఈసీ నిమ్మగడ్డ అనుమతి తీసుకోవాల్సిందేనని తెలిపింది. దీన్ని ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం.... ఎన్నికలు రద్దయ్యాయా వాయిదా పడ్డాయా అని పిటిషనర్‌గా ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడ్డాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ తెలిపారు. దీనిపై ఈసీ తరఫు న్యాయవాది పరమేశ్వర్ వివరణ కోరగా.. ఆయన నిరవధిక వాయిదా పడలేదని తాత్కాలిక వాయిదా మాత్రమేనన్నారు. త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

నిమ్మగడ్డ అనుమతి తీసుకోవాల్సిందే..
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడితే లేక రద్దయితే రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉంటాయని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అలా జరగలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ అనుమతి తీసుకునే ప్రధానమైన అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంటుందని తెల్చిచెప్పింది. అదే సమయంలో అసలు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోసం ఎస్ఈసీని ఆశ్రయించిందా అంటే అదీ లేదని కోర్టు నిర్ధారించింది. ఎస్ఈసీని సంప్రదించకుండా అనుమతి దొరకలేదన్నట్లుగా వ్యవహరించడం సరికాదని తెలిపింది. అభివృద్ధి పనులకు నిమ్మగడ్డ అనుమతి కోరాలని, దొరక్కపోతే తిరిగి తమ వద్దకు రావాలని సుప్రీం ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

సుప్రీం ఆదేశాలతో మళ్లీ నిమ్మగడ్డ వర్సెస్ జగన్
ఇప్పటికే స్ధానిక సంస్దల ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్న వైసీపీ సర్కారు అభివృద్ది పనుల విషయంలో ఆయన అనుమతి తీసుకుంటుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నందున నిమ్మగడ్డను ఒకటీ అరా విషయాల్లో సంప్రదించినా ఆయన సానుకూలంగా స్పందించకపోతే తిరిగి బంతి మళ్లీ సుప్రీంకోర్టుకే చేరే అవకాశాలున్నాయి. దీంతో సుప్రీంకోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం, నిమ్మగడ్డ ఇరువురూ పాటించకపోతే వీరి మధ్య మరో వార్‌కు తెరలేవడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే స్ధానిక సంస్ధల ఎన్నికలను కూడా సాధ్యమైనంత త్వరగా నిర్వహించేందుకు నిమ్మగడ్డ సన్నద్ధమవుతున్నారు.