జగన్ సర్కారుకు సుప్రీం రిజిస్ట్ర్రీలో ఎదురుదెబ్బ- పంచాయతీ పోరుకు లైన్ క్లియర్- రేపు నోటిఫికేషన్
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో జగన్ సర్కారుకూ, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కూ ముఖాముఖీ జరిగిన పోరు క్లైమాక్స్‌కు వచ్చేసింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై హడావిడిగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ సర్కారు.. పిటిషన్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం విఫలమైనట్లు తెలుస్తోంది. దీంతో సుప్రీంకోర్టు రిజిస్ట్ర్రీ ఈ పిటిషన్‌ను వెనక్కి పంపింది. ఇది అంతిమంగా రేపు విడుదల కావాల్సిన పంచాయతీ ఎన్నికల తొలి దశ నోటిఫికేషన్‌కు ఆటోమేటిగ్గా లైన్ క్లియర్ చేసేసింది.
ఏపీలో వేగంగా పరిణామాలు-నిమ్మగడ్డ వద్దకు ఐఏఎస్‌ల్ని పంపిన జగన్- ఏం జరుగుతోంది ?

జగన్ సర్కారుకు సుప్రీం రిజిస్ట్ర్రీలో చుక్కెదురు
ఏపీలో పంచాయతీ ఎన్నికల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. ఎన్నికలు నిర్వహించాలని తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ప్రాథమిక దశలోనే తిరస్కరణకు గురైంది. సాంకేతిక కారణాలను చూపుతూ సుప్రీంకోర్టు రిజిస్ట్ర్రీ ఈ పిటిషన్‌ను వెనక్కి పంపింది. దీంతో మరోసారి తప్పులు సవరించి పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంది. అందుకు తగిన సమయం లేకపోవడం, రేపు, ఎల్లుండి సుప్రీంకోర్టుకు సెలవులు కావడంతో ఈ పిటిషన్ సోమవారం మాత్రమే దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. కానీ రేపు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.

ఏపీ పంచాయతీ పోరుకు మార్గం సుగమం..
పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ప్రభుత్వ పిటిషన్ సాంకేతిక కారణాలతో రిజిస్ట్రీలోనే తిరస్కరణకు గురికావడంతో ఇక మరోసారి పిటిషన్ దాఖలు చేసే లోపు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయాయి. ఇదే అదనుగా ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేగంగా పావులు కదుపుతున్నారు ఇవాళ ఉదయం గవర్నర్‌తో భేటీ అయిన నిమ్మగడ్డ.. మధ్యాహ్నం ప్రభుత్వం పంపుతున్న అధికారులతో సమావేశమవుతున్నారు.

రేపు పది గంటలకు పంచాయతీ నోటిఫికేషన్
రేపు ఉదయం పది గంటలకు పంచాయతీ ఎన్నికల తొలిదశ పోరుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ విజయవాడలోని తన కార్యాలయంలో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. తద్వారా పంచాయతీ ఎన్నికల సంగ్రామానికి అధికారికంగా తెరలేపనున్నారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఎన్నికల కోడ్ అమల్లోకి రాగా.. రేపు నోటిఫికేషన్ తర్వాత ఎస్ఈసీ హోదాలో నిమ్మగడ్డ ఆదేశాలను ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాల్సిన పరిస్ధితి తలెత్తబోతోంది. దీనికి ముందుగానే సిద్ధమైన ప్రభుత్వం పంచాయతీ రాజ్ శాఖ చూస్తున్న ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు గిరిజాశంకర్, గోపాల కృష్ణ ద్వివేదీని నిమ్మగడ్డ వద్దకు పంపింది.

చివరి ఓవర్లో ఒత్తిడికి చేతులెత్తేసిన జగన్ ?
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా వ్యూహాత్మకంగా పావులు కదిపిన వైసీపీ సర్కార్.. ఈ విషయంలో హైకోర్టులోనూ నిమ్మగడ్డకు బ్రేకులు వేయగలిగింది. కానీ చివరి నిమిషానికి వచ్చే సరికి ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. హైకోర్టులో పంచాయతీ ఎన్నికలకు అనుకూలంగా తీర్పు రాగానే ఒత్తిడిలో దాన్ని సుప్రీంలో సవాల్ చేసిన వైసీపీ సర్కార్.. పిటిషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో పొరబాట్లు చేసినట్లు తెలుస్తోంది. చివరికి క్లైమాక్స్‌లో ఒత్తిడిని అధిగమించలేక మ్యాచ్ కోల్పోయిన చందాన నిమ్మగడ్డకు జగన్ మ్యాచ్ కోల్పోయారా అన్న చర్చ సాగుతోంది.

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఇదే
ఏపీలో ఇప్పటికే ఎస్ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం నాలుగు విడతలుగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. జనవరి 23న తొలి విడత, 27న రెండో విడత, 31న మూడో విడత, ఫిబ్రవరి 4న నాలుగో విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 5 న మొదటిదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 9 న రెండోదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 13 న మూడోదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 17 న నాలుగోదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగిన రోజే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.