ఏపీలో తొలిసారి ఎస్సీ,ఎస్టీ హైపవర్ కమిటీ భేటీ .. జగన్ కీలక ఆదేశాలు, చంద్రబాబుపై మంత్రులు ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన స్టేట్ లెవెల్ హైపవర్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ భేటీ అయింది . ఎస్సీ ఎస్టీ లకు సంబంధించి బాధితులకు రావాల్సిన భూమి, ఇతర పరిహారాలు, అట్రాసిటీ కేసుల విషయాలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ భేటీలో మంత్రులతో, అధికారులతో చర్చించారు. ఏపీ సచివాలయంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సమావేశంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పలు కీలక ఆదేశాలు ఇచ్చారు.

భూమి లేని చోట భూసేకరణ చేసైనా ఎస్సీ, ఎస్టీలకు భూమి ఇవ్వాలని జగన్ సూచన
భూమి లేని చోట భూసేకరణ చేసైనా ఎస్సీ ఎస్టీలకు భూమి ఇవ్వాలని సూచించారు. సీఎం జగన్ అట్రాసిటీ కేసులు పెట్టిన వారికి సత్వర న్యాయం అందాలని పేర్కొన్నారు. కలెక్టర్ , ఎస్పీలు కూడా వారానికి ఒకరోజు ఎస్సీ వాడలలో పర్యటించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. తద్వారా ప్రభుత్వం వారి వెంట ఉందని ఎస్సీ, ఎస్టీ లకు భరోసా కల్పించాలని సీఎం జగన్ పేర్కొన్నారు. పోలీసులు ముద్దాయిగా ఉన్న కేసుల్లో పోలీసులను సైతం జైలుకు పంపించాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం.

చంద్రబాబు హయాంలో ఒక్కసారి కూడా సమావేశం జరగలేదన్న పినిపే విశ్వరూప్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జరిగిన స్టేట్ లెవెల్ హైపవర్ ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పాటు మంత్రి మేకతోటి సుచరిత, పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్ , సి ఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ లు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం మాట్లాడిన మంత్రులు గత ప్రభుత్వ పాలనలో చంద్రబాబు ఒక్కసారి కూడా సమావేశం ఏర్పాటు చేయలేదని ఏడాదికి రెండు సార్లు జరగవలసిన ఈ సమావేశం ఒక్కసారి కూడా జరగలేదంటే దళితుల పట్ల చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు అని మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు.

గతంతో పోలిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు తగ్గాయన్న హోంమంత్రి సుచరిత
రాష్ట్రంలో గతంతో పోలిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు తగ్గాయని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. గతంలో విచారణ సౌమ్య 60 రోజులు ఉంటే ఇప్పుడు 50 రోజులకు తగ్గిందని అట్రాసిటీ కేసుల పై పోలీసులు వెంటనే స్పందిస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. గతంలో 3.6 శాతం కేసులలో విచారణ పూర్తయితే ప్రస్తుతం ఏడు శాతం వరకు పెరిగిందని సుచరిత పేర్కొన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒక సారి సమావేశం నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు హోంమంత్రి సుచరిత. దళితులు, గిరిజనులు ఈ సమావేశాలతో ఆత్మస్థైర్యం పొందుతారని హోం మంత్రి సుచరిత ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ సెల్ ను మరింత బలోపేతం చేస్తామన్న మంత్రి ఆదిమూలపు సురేష్
ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ సెల్ ను మరింత బలోపేతం చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు .ఎస్సీ, ఎస్టీలకు భూమి లేని చోట భూసేకరణ చేసైనా సరే భూమి ఇవ్వాలని సీఎం జగన్ సూచించారని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు.