Amaravati Land Scam: జగన్ సర్కారుకు సుప్రీంలో భారీ ఊరట- హైకోర్టు ఉత్తర్వులపై స్టే!
ఏపీ ప్రభుత్వానికి ఇవాళ సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యవహారంలో జగన్ సర్కారు చేస్తున్న పోరాటం కూడా మరో మలుపు తీసుకుంది. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అమరావతి భూముల స్కాంపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను మీడియాలో రిపోర్టింగ్ చేయకుండా గతంలో హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆదేశాలను సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. ఈ కేసు ఎఫ్ఐఆర్లో జస్టిస్ ఎన్వీ రమణ కుమార్తెల పేర్లు ఉన్నాయన్న కారణంతో దీనిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో సుప్రీం వీటిపై స్టే విధించింది.

అమరావతి భూముల స్కాం ఎఫ్ఐఆర్..
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని కోసం భారీ ఎత్తున భూసేకరణ జరిగింది. దీనిపై ముందస్తు సమాచారంతో అప్పటి అడ్వకేట్ జనరల్‌గా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్ మరికొందరితో కలిసి పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వైసీపీ సర్కారు ఆదేశాల మేరకు వీటిపై విచారణ జరిపిన ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో దమ్మాలపాటి శ్రీనివాస్, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జస్టిస్ ఎన్వీ రమణ ఇద్దరు కుమార్తెల పేర్లు కూడా ఉన్నాయి. వీరంతా నేరపూరిత కుట్రకు పాల్పడటం ద్వారా రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా భూములు కొనుగోలు చేశారని ఏసీబీ ఆరోపించింది. దీంతో ఈ ఎఫ్ఐర్‌లోని అంశాలు తీవ్ర దుమారం రేపాయి. వెంటనే ఏసీబీ ఎఫ్ఐఆర్పై మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు.

ఏసీబీ ఎఫ్ఐర్ రిపోర్టింగ్‌పై హైకోర్టు గ్యాగ్ ఆదేశాలు..
అమరావతి భూముల స్కాంలో నమోదైన ఎఫ్ఐర్లో అంశాలు వివాదాస్పదంగా ఉండటం, అందులో కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుమార్తెల పేర్లు ఉండటంతో ఇది ప్రజల్లోకి వెళ్లడం మంచిది కాదని హైకోర్టు భావించింది. దీంతో ఏసీబీ ఎఫ్ఐఆర్ను మీడియాలో ప్రసారం, ప్రచురణ చేయకుండా, సోషల్ మీడియాలోనూ దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా హైకోర్టు గ్యాగ్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం మీడియాలో రిపోర్టు కాలేదు. కానీ ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డేకు రాసిన లేఖలో ప్రస్తావించిన వైసీపీ అధినేత, సీఎం జగన్.. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులోనూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై విచారణ జరిపింది.

హైకోర్టు ఉత్తర్వుపై సుప్రీంకోర్టు స్టే...
అమరావతి భూముల స్కాంలో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై మీడియా రిపోర్టింగ్ చేయకుండా, సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయకుండా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ స్టే ఇచ్చింది. ఇది భావప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధమని తెలిపింది. ఈ వ్యవహారంలో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ సహా 13 మందికి సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. తదుపరి విచారణను జనవరి చివరి వారానికి వాయిదా వేసింది. అప్పటి వరకూ ఈ కేసును ఫైనల్ చేయొద్దని ఏపీ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.

సుప్రీంలో ఏపీ సర్కారు వాదనలివే..
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ హైకోర్టు ఆదేశాలను తీవ్రంగా తప్పుబట్టారు. రాజధాని భూ కుంభకోణం వివరాలు ఎందుకు వెల్లడి కాకూడదని ప్రశ్నించారు. నేరం జరిగిన తర్వాత దర్యాప్తు చేయొద్దా అని నిలదీశారు. దర్యాప్తు, మీడియా రిపోర్టింగ్ ఏదీ జరగకూడదా అని రాజీవ్ ధావన్ ప్రశ్నించారు. దమ్మాలపాటి మాత్రమే గ్యాగ్ ఆర్డర్ కోసం హైకోర్టును ఆశ్రయిస్తే మొత్తం 13 మంది నిందితులకు దీన్ని ఎలా వర్తింపచేస్తారని నిలదీశారు. పిటిషనర్ అడగకుండానే ఇలాంటి ఆదేశాలు ఎలా పాస్ చేస్తారని ధావన్ ప్రశ్నించారు. దీంతో వాదనలు విన్న సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది.

వైఎస్ జగన్‌కు భారీ ఊరట...
అమరావతి భూ కుంభకోణం విషయంలో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై దర్యాప్తు కొనసాగించకుండా, మీడియా రిపోర్టింగ్ చేయనీయకుండా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే జగన్ సర్కారుకు భారీ ఊరట కానుంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్‌కు కూడా లేఖ రాసిన నేపధ్యంలో సుప్రీం స్టే ఉత్తర్వులు తమ వాదనకు అనుకూలంగా ఉండటంపై ప్రభుత్వ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా హైకోర్టు తీరుపై తాము చేస్తున్న పోరాటానికి సుప్రీంలో మద్దతు లభించడంతో పాటు అమరావతి భూముల స్కాంపై తదుపరి దర్యాప్తు కోసం అవకాశం దొరికినట్లయింది.