నేటి నుంచే.. ఏపీ సహా పలు రాష్ట్రాల్లో స్కూళ్ల పున:ప్రారంభం... పకడ్బందీ చర్యలతో ప్రభుత్వాలు...
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం(నవంబర్ 2) నుంచి స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. దాదాపు 8 నెలల సుదీర్ఘ విరామం తర్వాత స్కూళ్లు నేటి నుంచి పునరుద్దరించబడనున్నాయి. దశల వారీగా ఆయా తరగతులకు క్లాసులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి 9,10 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ క్లాసులు మొదలుకానున్నాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తూ క్లాసులను నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్,అసోం,ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ నేటి నుంచే స్కూళ్లు రీఓపెన్ అవుతుండటం గమనార్హం.

ఇవీ జాగ్రత్తలు...
స్కూళ్ల రీఓపెన్ నేపథ్యంలో కోవిడ్ 19 దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ప్రతీరోజూ కేవలం ఒంటిపూట బడులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది. అంటే ఉదయం 9గం. నుంచి మధ్యాహ్నం 1.30గం. వరకు మాత్రమే క్లాసులు జరుగుతాయి. అది కూడా క్లాసుకు 16 మంది చొప్పున రోజు విడిచి రోజు క్లాసులు జరగనున్నాయి. క్లాస్ రూమ్‌లో విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా,ఫేస్ మాస్కులు ధరించేలా తగు జాగ్రత్తలు తీసుకోనున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులను ఇంటికి పంపిస్తారు.

దశలవారీగా ఆయా తరగతులకు...
నవంబర్ నెల మొత్తం ఇదే తరహాలో క్లాసులు జరగనున్నాయి. ఈ నెలలో పరిస్థితులను బట్టి డిసెంబర్ నెల క్లాసులపై నిర్ణయం తీసుకోనున్నారు. సోమవారం(నవంబర్ 2) నుంచి 9,10,ఇంటర్మీడియట్ సెకండియర్ క్లాసులు ప్రారంభమవనుండగా... నవంబర్ 16 నుంచి ఇంటర్ ఫస్టియర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. అలాగే ఈ నెల 23 నుంచి 6,7,8 తరగతులు,డిసెంబర్ 14,15 నుంచి 1-5 తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇక ఇదే నెల 23 నుంచి రెసిడెన్షియల్ స్కూళ్లు,హాస్టళ్లు ప్రారంభం కానున్నాయి.

అకడమిక్ ఇయర్‌లో మార్పు...
డిగ్రీ,పీజీలకు సంబంధించి ఈసారి సెమిస్టర్ మార్చి 6తో ముగియనుంది. తర్వాతి సెమిస్టర్ మార్చి 25 నుంచి అగస్టు 7 వరకు జరుగుతుంది. సాధారణంగా ప్రతీ ఏడాది ఏప్రిల్ 30తో అకడమిక్ ఇయర్ ముగిసేది. కానీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈసారి అగస్టు 7వరకు కొనసాగనుంది. వేసవి సెలవుల గురించి ఇప్పటికైతే ప్రకటించలేదు.

హిమాచల్,అసోం,ఉత్తరాఖండ్‌లోనూ...
హిమాచల్ ప్రదేశ్,అసోం,ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ నేటి నుంచి స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. విద్యార్థులను స్కూళ్లకు పంపించేందుకు తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరి అని హిమాచల్,ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఉత్తర్వులు జారీ చేశాయి. విద్యార్థుల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు.. వారికి ఐరన్,ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు ఇవ్వాలని అసోం విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లతో పాటు కేంద్రీయ విద్యాలయాలు,నవోదయ విద్యాలయ స్కూళ్లు కూడా నేటి నుంచే పున:ప్రారంభం కానున్నాయి.ఇప్పటికే ఉత్తరప్రదేశ్,పంజాబ్ సహా పలు రాష్ట్రాలు స్కూళ్లను పునరుద్దరించిన సంగతి తెలిసిందే. తమిళనాడు,ఒడిశా రాష్ట్రాల్లో నవంబర్ 16 నుంచి స్కూళ్లను తెరవనున్నారు.