ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో సింగిల్ నామినేషన్ లపై ఎస్ఈసి ఫోకస్ .. నివేదికలు పంపాలని కలెక్టర్లకు ఆదేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్న సమయంలోనే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఒకపక్క పంచాయితీలతోపాటుగా, మరోపక్క మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రాజకీయం వేడెక్కింది. ఏపీ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో , నోటిఫికేషన్ విడుదలైన మున్సిపాలిటీలలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది.
ఇక రాష్ట్ర ఎన్నికల కమిషన్ వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని సింగిల్ నామినేషన్లపై ప్రధానంగా దృష్టి సారించనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఘర్షణల నడుమ కొనసాగుతున్న రెండోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ .. వివిధ జిల్లాల్లో పరిస్థితి ఇదే

గుంటూరు, చిత్తూరు, కడప జిల్లాలలోని ఆరు మున్సిపాలిటీలలో సింగిల్ నామినేషన్లు
ముఖ్యంగా గుంటూరు, చిత్తూరు, కడప జిల్లాలలోని ఆరు మున్సిపాలిటీలలో వివిధ వార్డుల్లో సింగిల్ నామినేషన్లు దాఖలు కావడంపై కలెక్టర్ ల నుండి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నివేదిక కోరారు. ఈనెల 20వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల సహా రాయచోటి, పుంగనూరు, పలమనేరు, తిరుపతి, మాచర్ల కార్పొరేషన్ ల లోని వివిధ వార్డుల్లో సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి.

కలెక్టర్లను నివేదికలు పంపాలని ఎన్నికల కమీషన్ ఆదేశం
పులివెందుల రాయచోటిలో 21 వార్డులలో, పుంగనూరులో 16, పలమనేరులో 10 ,మాచర్లలో పది వార్డుల్లో సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. తిరుపతి కార్పొరేషన్ లోని ఆరు డివిజన్లలో సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. వివిధ వార్డుల్లో, కార్పొరేషన్లలో దాఖలైన సింగిల్ నామినేషన్ల సరళిపై కలెక్టర్ ల నుండి నివేదికలు వచ్చిన తర్వాత వాటిని సమగ్రంగా పరిశీలించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకోనున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వెయ్యకుండా అడ్డుకుంటున్నారా ? అనుమానం
మున్సిపల్ ఎన్నికలలో కూడా బలవంతంగా నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారా అన్న కోణంలో వీటిని పరిశీలిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సింగిల్ నామినేషన్లు దాఖలు అయిన కార్పొరేషన్ల పై, మున్సిపాలిటీ ల పై దృష్టి పెట్టి కలెక్టర్లను నివేదిక ఇవ్వాలని కోరటంతో నివేదికలను పంపేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. కలెక్టర్ల నివేదిక అందిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ సింగిల్ నామినేషన్లపై నిర్ణయం తీసుకోనుంది.