పంచాయతీ వార్ .. గోపాలకృష్ణ ద్వివేది,గిరిజా శంకర్ బదిలీలో కొత్త ట్విస్ట్; బదిలీలకు ఎస్ఈసి నో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ వార్ అటు ప్రభుత్వానికి, ఇటు ఎన్నికల సంఘానికి మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంగా మారింది. పంచాయతీ ఎన్నికల ఎపిసోడ్ లో అడుగడుగునా ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పంచాయతీరాజ్ శాఖలో ఉన్నతాధికారులు బదిలీ అయినట్లుగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించిన నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ ప్రతిపాదనలను తిరస్కరించింది.
పంచాయితీ నామినేషన్ల దాఖలుకు వచ్చిన అభ్యర్థులు వెనక్కి , గుంటూరులో అందుకు భిన్నంగా

గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్ బదిలీ .. ప్రకటన చేసిన మంత్రి .. ట్విస్ట్ ఇచ్చిన ఎస్ఈసి
పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ బదిలీ అయ్యారని మంత్రి పేర్కొనడంతో పాటుగా ఎస్ఈసి ఆదేశాలతోనే బదిలీలు చేసినట్టు , ఎస్ఈసి ఏం బదిలీలు చేసుకున్నా .. ఏం చేస్తున్నా తాము పట్టించుకోమని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి ప్రకటనతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆదేశాలను పాటిస్తూ పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులను వారిని బదిలీ చేసిందనే వార్తలు వెల్లువెత్తాయి.అయితే ఎన్నికల ప్రక్రియ కీలక దశలో ఉన్నప్పుడు బదిలీలు తగదని స్పష్టం చేసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్.

బదిలీల ప్రతిపాదనను తిరస్కరించిన ఎస్ఈసి
గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ ల బదిలీల ప్రతిపాదనను ఎస్ఈసి తిరస్కరించింది. ఒకవేళ ప్రభుత్వం బదిలీ చేయాలని భావిస్తే ఎన్నికల విధివిధానాలను పాటించాలని సూచించింది.
సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్రంలో ఎన్నికలను నిర్వహిస్తున్నామని, ఇప్పటికే నోటిఫికేషన్ రీషెడ్యూల్ చేయడం జరిగిందని, ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత ముఖ్యమైన ఇద్దరు అధికారుల బదిలీ సరైన చర్య కాదని పేర్కొంది. కొత్తగా వచ్చే అధికారులు ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంటూ ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన జారీ చేసింది.

చర్చనీయాంశంగా ప్రభుత్వ , ఎన్నికల సంఘం నిర్ణయం
ఒకపక్క మంత్రి నిమ్మగడ్డ ఆదేశాలమేరకే ఇద్దరు ఉన్నతాధికారులను బదిలీ చేసినట్లుగా ప్రకటిస్తే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ బదిలీల ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు ప్రకటన చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఏదేమైనప్పటికీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయాలపై తీవ్ర అసహనం తో ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠను పెంచుతున్నాయి.

పంచాయతీ వార్ పూర్తయ్యేలోపు ఏం జరుగుతుందో .. రాష్ట్రంలో హాట్ టాపిక్
పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే లోపు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అన్న చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ఉన్నతాధికారుల బదిలీల ప్రక్రియను తిరస్కరిస్తూ ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ప్రకటన జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఏవిధంగా ఉండబోతున్నదనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అడుగడుగునా వ్యతిరేకిస్తున్న ఎన్నికల కమీషన్ ఈ ఎన్నికలలో ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తుంది అన్న టాక్ బయట వినిపిస్తుంది .