27న కలెక్టర్లు, ఎస్పీలతో నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్.. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎస్ అత్యవసర భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగా రేపు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది .ఇక ఈ నేపధ్యంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సి ఎస్ ఆదిత్యనాథ్ దాస్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించటం ప్రాధాన్యతను సంతరించుకుంది .
మాకు న్యాయం జరగలేదు .. చంద్రబాబును టార్గెట్ చేసిన ఏపీ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామిరెడ్డి

రేపు ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ ..
సీఎస్ ను కలిసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు
రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న నేపథ్యంలో, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఉద్యోగ సంఘాల నాయకుల సూచనలను, అభ్యంతరాలను తెలుసుకుని రేపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో భేటీలో మాట్లాడనున్నారు. కరోనా కాలంలో ఎన్నికల నిర్వహణ విషయమై సి.యస్. ఆదిత్యనాథ్ దాస్ తో భేటీ అయిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ ఇబ్బందులను ఏకరువు పెట్టారు.

సీఎస్ ముందు మూడు ప్రధాన విజ్ఞప్తులు చేసిన ఏపీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు
తమ అభ్యంతరాలను సి ఎస్ ఆదిత్యనాథ్ దాస్ దృష్టికి తీసుకువెళ్లారు ఉద్యోగులు. ప్రధానంగా మూడు డిమాండ్లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ముందుంచారు . తాము ఎన్నికల విధులకు సిద్ధంగానే ఉన్నామని చెప్పిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు 50 ఏళ్లు దాటిన మహిళా ఉద్యోగులను పోలింగ్ కౌంటింగ్ విధులకు దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అలాగే ఎన్నికల విధుల్లో ఎవరైనా కరోనా సోకి మృతిచెందితే 50 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ కి విజ్ఞప్తి చేశారు.

రేపు వీడియో కాన్ఫరెన్స్ లో ఎన్నికల కమీషనర్ తో మాట్లాడనున్న సీఎస్
ఉద్యోగ సంఘాల నేతలు చేసిన విజ్ఞప్తులను రేపు చీఫ్ సెక్రటరీ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వెళ్లనున్నారు.
పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చకచకా ఎన్నికల కమిషన్ పావులు కదుపుతోంది. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను చేయడంలో నిమగ్నమైంది . అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఈనెల 27వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు . వీడియో కాన్ఫరెన్స్ కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డిజిపి గౌతమ్ సవాంగ్ కు హాజరు కానున్నారు.

రేపు వీడియో కాన్ఫరెన్స్ .. సర్వత్రా ఆసక్తి
నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు, ఓటర్ల జాబితా రూపకల్పన తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తో చర్చించనున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అధికారులకు సూచనలు చేయనున్నారు. ఇక రేపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తో, ప్రభుత్వ ఉన్నత అధికారులకు జరగనున్న వీడియో కాన్ఫరెన్స్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఈ నేపథ్యంలో నేడు జరిగిన చీఫ్ సెక్రటరీ తో ఉద్యోగ సంఘాల భేటీ కీలకంగా మారింది.
ఫోటోలు: ఏపీలో 72వ గణతంత్ర వేడుకలు: హాజరైన గవర్నర్ హరిచందన్ సీఎం జగన్