నిన్న వైయస్ ఫ్రెండ్స్: నేడు సన్నిహితులే జగన్కు షాక్.. ఎవరు, ఎందుకు?
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి సన్నహితులతో పాటు.. ఆయన సన్నిహితులు కూడా ఝలక్ ఇస్తున్నారు. ఇటీవలి కాలంలో సైకిల్ ఎక్కుతున్న ముఖ్యనేతలంతా జగన్కు సన్నిహితులే.
వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితులుగా ఉన్న పలువురు.. జగన్ పార్టీ స్థాపించాక ఆయన వెంట నడిచారు. కొందరు ఆయనకు దూరం పాటించారు. వైసిపిని స్థాపించాక కొందరు నేతలు జగన్కు చాలా దగ్గరయ్యారు. అందులో జ్యోతుల నెహ్రూ, సుజయ కృష్ణ రంగారావు, భూమా నాగిరెడ్డిలు కూడా ఉన్నారు.
అయితే, వారే ఇప్పుడు పార్టీ వీడుతుండటం గమనార్హం. పార్టీలో జ్యోతులకు, భూమా కుటుంబానికి జగన్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే వారు కూడా జగన్పై అంతే ఆప్యాయత కనబర్చేవారు. వారు ఇప్పటికే సైకిల్ ఎక్కారు. తాజాగా, విజయనగరంలో జగన్కు అండగా ఉంటున్న సుజయ కృష్ణ కూడా సైకిల్ ఎక్కుతున్నారు.

వైయస్ జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్కు ఆయన తండ్రి సన్నిహితులతో పాటు స్వయంగా జగన్కు దగ్గరైన వారు కూడా షాకిస్తున్నారు. వైయస్ సన్నిహితులు సూరీడు, సాయిప్రతాప్, కెవిపి రామచంద్ర రావులు జగన్ వైపు చూడలేదు. ఇప్పుడు జగన్కు సన్నిహితంగా మెలిగిన భూమా, జ్యోతుల, సుజయలు షాకిచ్చారు.

భూమా నాగి రెడ్డి
వైయస్ జగన్ వైఖరి కారణంగానే భూమా నాగిరెడ్డి సైకిల్ ఎక్కినట్లుగా చెబుతున్నారు. ఆయన వ్యవహార శైలి భూమాకు మింగుడు పడటం లేదని వార్తలు వచ్చాయి.

జ్యోతుల నెహ్రూ
వైసిపిలో సీనియర్ నేత. భూమా టిడిపిలో చేరాక.. ఆయనకు పీఏసీ పదవి వస్తుందని అందరూ భావించారు. కానీ తొలిసారి ఎన్నికైన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఇచ్చారు. దీంతో ఆయన కూడా సైకిల్ ఎక్కారు.

సుజయ కృష్ణ రంగారావు
ఇక, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు ఆయన సోదరుడు కూడా రేపో మాపో సైకిల్ ఎక్కనున్నారు. బొత్స సత్యనారాయణ రాకకు ముందు సుజయకు చాలా ప్రాధాన్యం ఉండేదని, బొత్స చేరిక తర్వాత ఆయనకు ప్రాధాన్యత తగ్గిపోయిందని అందుకే టిడిపిలో చేరుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!