సీరో సర్వైలెన్స్ సర్వే .. నేటి నుండి ఏపీలో మిగతా 9 జిల్లాలలో
కరోనా వైరస్ ప్రభావాన్ని అంచనా వేయడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీరో సర్వైలెన్స్ సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తూర్పుగోదావరి, నెల్లూరు ,అనంతపురం ,కృష్ణా జిల్లాలో ఈ సర్వే నిర్వహించగా, నేటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మిగతా తొమ్మిది జిల్లాలలో సర్వే నిర్వహించనున్నారు . ఒక్కో జిల్లాలో ఐదువేల నమూనాలను సేకరించి ఈ సర్వేను చేయనున్నారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. అందుకోసం ప్రణాళిక ను సైతం సిద్ధం చేశారు.
ఈ సర్వేలో ప్రధానంగా హైరిస్క్ ఉన్న ప్రాంతాల్లో ఒక వెయ్యి నమూనాలను సేకరిస్తారు. మిగతా నాలుగు వేల నమూనాలను జిల్లా వ్యాప్తంగా సేకరిస్తారు. 60 శాతం కంటైన్మెంట్ జోన్ లోనూ, 40 శాతం నాన్ కంటైన్మెంట్ జోన్ లలోనూ నిర్వహిస్తారు. ఈ జోన్లలో కూడా 30 శాతం అర్బన్ ప్రాంతాల్లోనూ, 60 శాతం రూరల్ ప్రాంతాల్లోనూ నమూనాలను తీసుకుంటారు. ఇక అర్బన్ లో మూడు వార్డులలోనూ , రూరల్ లో 16 గ్రామాల్లో ఈ నమూనాలను సేకరిస్తారు.
వారం రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, తద్వారా కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలోని నాలుగు జిల్లాలలో ఈ సర్వైలెన్స్ సర్వే నిర్వహించారు. తూర్పు గోదావరి, నెల్లూరు అనంతపురం, కృష్ణా జిల్లాలలో నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. 90 శాతం మంది బాధితులకు అసలు కరోనా లక్షణాలు ఏమాత్రం లేవని గుర్తించారు. దగ్గు ,జలుబు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు లేకపోయినా కరోనా టెస్టుల్లో పాజిటివ్ గా వస్తున్నట్టు గుర్తించారు. ఇప్పుడు మిగతా తొమ్మిది జిల్లాల్లోనూ సర్వే నిర్వహించి ఏపీలో కరోనా ప్రభావాన్ని ఈ సర్వే ద్వారా అంచనా వేయనున్నారు.