తిరుమలలో కోటి మందికి పైగా..
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం నాడు ఏకంగా 95,080 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 39,668 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.47 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 20 నుంచి 22 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

వేసవి సెలవుల కారణంగా గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. ఈ క్రమంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. వైకుంఠం కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల కోసం టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాదం, మంచినీటిని అందజేసే ఏర్పాట్లు చేసింది.
శనివారం నాడు శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 95 వేలను అధిగమించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది సరికొత్త రికార్డు. దాదాపు దశాబ్ద కాలం తరువాత శ్రీవారిని అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకోవడం ఇదే తొలిసారి.
ప్రత్యేకించి- మే 16వ తేదీ నుండి తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. టీటీడీ ఉద్యోగులు అవిశ్రాంతంగా అహర్నిశలు విధులు నిర్వహించి, గత రెండు వారాల్లోని గురువారాలు, శుక్రవారాల్లో కూడా అత్యధిక మంది భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీవారి ఆలయ సిబ్బంది, విజిలెన్స్ విభాగం సహకారంతో అన్నప్రసాదం, మంచినీరు, పాల వితరణ భక్తులకు సమర్థవంతంగా అందించారు.
దీంతో అనేకమంది భక్తులు సౌకర్యవంతంగా దర్శనం చేసుకోగలిగారు. గతేడాది మే నెలతో పోల్చితే, ఈ సారి 55,759 మంది అధికంగా దర్శనం పొందారు. 2024 మేలో 23,23,493 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, ఈ ఏడాది అదే నెలలో 23,79,252 మంది భక్తులు దర్శించుకున్నారు.
అలాగే- అన్నప్రసాద వితరణలో కూడా ఈ ఏడాది కొత్త రికార్డు నమోదైంది. 2024 మేలో 71 లక్షల వితరణలు జరిగితే, ఈ సంవత్సరం మేలో 1.33 కోట్ల మంది భక్తులు శ్రీవారి అన్నప్రసాదాలను స్వీకరించారు. తలనీలాలను సమర్పించిన భక్తుల సంఖ్య, లడ్డూ విక్రయాల పరంగా కూడా గత ఏడాది మేతో పోల్చితే అధికంగా నమోదయ్యాయి.
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, ఇతర అన్నప్రసాద కేంద్రాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూలైన్లలల్లో అన్నప్రసాదాల వితరణ పెద్ద సంఖ్యలో జరిగినట్లు టీటీడీ అధికారులు వివరించారు.
ప్రతిరోజూ దాదాపు 3,000 మంది శ్రీవారి సేవకులు, 2,150 మంది శానిటరీ కార్మికులు, సూపర్ వైజర్లు, ఇన్‌స్పెక్టర్లు, యూనిట్ అధికారులు భక్తుల కోసం 24 గంటలు సేవలు అందిస్తోన్నారు. క్యూలైన్లలోని భక్తులకు నిరంతరాయంగా నాలుగు షిప్టుల‌్లో అన్నప్రసాదాలు, మంచినీటిని పంపిణీ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications